Begin typing your search above and press return to search.

ఎక్కడ తగ్గాలో మరోసారి చేతలతో ఫ్రూవ్ చేసిన మోడీ.. మనసు దోచేశారు!

మోడీ నిలుచున్న ఎదుట చిన్న త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. తన ప్లేస్ లోకి వెళ్లి.. నిలుచునే ముందు వొంగి జాతీయ పతాకాన్ని తన చేతిలో తీసుకొని జేబులో పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:47 AM GMT
ఎక్కడ తగ్గాలో మరోసారి చేతలతో ఫ్రూవ్ చేసిన మోడీ.. మనసు దోచేశారు!
X

ఎప్పుడేం చేయాలన్న విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఉన్న స్పష్టత.. ఆయనపై గౌరవాన్ని మరింత పెంచేలా చేస్తుంది. తాజాగా అలాంటి ఉదంతమే అంతర్జాతీయ వేదికగా చోటు చేసుకుంది. చిన్న విషయాల్ని పెద్దగా పట్టించుకోని అంశాల్ని.. మోడీ మాత్రం సునిశితంగా పరిశీలిస్తూ.. స్పందించే తీరు ఆయనపై గౌరవాన్ని రెట్టింపుచేసి.. ఆయనపై ఉన్న ఆగ్రహాన్ని తగ్గించేలా చేస్తుంది.

ప్రస్తుతం సౌతాఫ్రికాలో ప్రధానమంత్రి మోడీ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పదిహేనో బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. జోహన్స్ బర్గ్ లో ప్లీనరీ సమావేశానికి ముందు..కూటమిలోని భాగస్వామ్య దేశాలకు చెందిన దేశాధ్యక్షులు.. ప్రధానమంత్రులతో కలిసి గ్రూప్ ఫోటో దిగేందుకు వేదిక మీదకు చేరుకున్నారు. వేదిక మీదకు చేరుకున్నంతనే.. అక్కడ నేల మీద ఉంచిన ఆయా దేశాల జాతీయ పతాకాల ఎదుట నిలుచోవాల్సి ఉంటుంది. ఇదంతా ప్రోటోకాల్ ప్రకారం సాగుతుంది.

మోడీ నిలుచున్న ఎదుట చిన్న త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. తన ప్లేస్ లోకి వెళ్లి.. నిలుచునే ముందు వొంగి జాతీయ పతాకాన్ని తన చేతిలో తీసుకొని జేబులో పెట్టుకున్నారు. మోడీ చర్యను గమనించిన దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు సిరిల్ రమఫోసా కూడా వెంటనే వొంగి మోడీ మాదిరి తమ జాతీయ పతాకాన్ని చేతికి తీసుకున్నారు. ఆ వెంటనే సహాయకుడు ఒకరు స్టేజ్ మీదకు రాగా.. తాను చేతిలో తీసుకున్న జాతీయ పతాకాన్ని సహాయకుడికి అందించారు. మోడీని కూడా ఇవ్వమని అడగ్గా.. అప్పటికే జేబులో పెట్టేసుకున్న మోడీ.. తాను ఇవ్వనన్న విషయాన్ని సున్నితంగా చెప్పేశారు.

దేశం పట్ల అభిమానం ఉండటం వేరు. సమయానికి తగ్గట్లు దాన్ని చేతల్లో చూపటం కీలకం. ఆ విషయంలో మోడీ వ్యవహరించిన తీరును పలువురు అభినందిస్తున్నారు. అదే సమయంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు తీరును తప్పు పడుతున్నారు. మోడీ మాదిరి కోటు జేబులో పెట్టుకోకుండా.. సహాయకుడికి చేతికి అందించటమా? అని ప్రశ్నిస్తున్నారు. విదేశీ వేదిక మీద తన దేశంపై తనకున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసిన మోడీ చర్యకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.