Begin typing your search above and press return to search.

కోటి 13 లక్షల కోట్లు... మోడీ చేసిన అప్పు ఎక్కడికి పోయింది !?

ఒక కోటీ పద మూడు లక్షల కోట్ల రూపాయలు. గబుక్కున ఈ నంబర్ చదవాలంటేనే గాభరా అవుతుంది.

By:  Tupaki Desk   |   15 May 2024 1:30 PM GMT
కోటి 13 లక్షల కోట్లు... మోడీ చేసిన అప్పు ఎక్కడికి పోయింది !?
X

ఒక కోటీ పద మూడు లక్షల కోట్ల రూపాయలు. గబుక్కున ఈ నంబర్ చదవాలంటేనే గాభరా అవుతుంది. గుండెలలో దడ పుడుతుంది. భారత దేశం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ పాతిక లక్షల కోట్ల దాకా ఉంటుంది. అదే దేశానికి అతి పెద్ద బడ్జెట్.

మరి దానికి అయిదారు రెట్లు దేశంలో అప్పు ఉంది అంటే ఆశ్చర్యం కాదు ఆందోళన పెరుగుతుంది. అంతే కాదు ఇంత అప్పు ఎందుకు చేశారు ఎపుడు చేశారు అన్న ప్రశ్నలు కూడా వెంట వెంటనే వస్తాయి. దీనిని బట్టి చూస్తే కనుక దేశంలో ఈ అప్పుని కొండంత రుణంగా చూడాలి. కోట్లాది జనం నెత్తిన పడిన భారంగానే చూడాలి.

సగటు భారతీయుడిని వేధించే ప్రశ్నగా ఉన్నది కూడా ఇదే. ఇంత అప్పు ఎందుకు తెచ్చారు, ఏ టైం లో తెచ్చారు అంటే దానికి జవాబు మోడీ పదేళ్ల పాలనలో అని సమాధానం వస్తుంది. పదేళ్ళలో కోటీ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే ఏటా దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పు అన్న మాట.

ఇంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది ప్రతీ ఒక్కరినీ తొలిచేస్తున్న ప్రశ్నగా ఉంది. ఇక ఈ దేశానికి అప్పులు లేవా కేవలం మోడీ ప్రభుత్వమే చేసిందా అంటే అప్పులు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే మోడీ ముందు దేశాన్ని ఏలిన 13 మంది ప్రధానులు అంతా కలసి చేసిన అప్పు కేవలం 55 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని ఒక లెక్క ఉంది. అది కూడా 1952 నుంచి 2014 దాకా అంటే ఆరు దశాబ్దాల కాలంలో చేసిన అప్పు అన్న మాట.

అరవై ఏళ్ళల్లో అప్పు 55 లక్షల కోట్లు అంటే సగటున ప్రతీ ఏటా లక్ష కోట్లు అని చెప్పుకోవాలి. అదే అప్పు మోడీ పాలనలో పది నుంచి పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఏటా ఎందుకు పెరిగింది అన్నది కీలకమైన ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఒకసారిగా పదింతలు ఎందుకు అప్పు పెరిగింది అన్నది కూడా ఆర్ధిక నిపుణులతో పాటు అందరినీ వేధిస్తున్న ప్రశ్నగా ఉంది.

ఇక గతంలో పనిచేసిన ప్రధానులు తెచ్చిన అప్పును దేశాభివృద్ధి కోసం వెచ్చించారు అని చెబుతున్నారు. దానికి ఒక లెక్క చూపిస్తున్నారు. దేశంలో కర్మాగారాలు కట్టారు, మౌలిక సదుపాయాలు పెంచారు, రోడ్లు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు దేశానికి అవసరం అయ్యే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

మరి మోడీ ప్రభుత్వం అంతకు పదింతలు చేసిన అప్పుతో దేశంలో ఏమి నిర్మించారు. ఏ రకమైన మౌలిక సదుపాయాలు తెచ్చారు. దేనికి ఎంత అన్నది పూర్తిగా లెక్కలు తెలియాలి కదా అన్న చర్చ అయితే ఉంది. మోడీ ప్రభుత్వ హయాంలో చూస్తే దేశంలో ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యతను ప్రైవేట్ రంగం మీదకు మళ్ళించారు. వారు అవి చూస్తున్నారు.

దేశంలో అభివృద్ధి అంటే పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం కానీ లేక పరిశ్రమల స్థాపన కానీ ఏమీ జరగలేదు. పైగా ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. భారీ నీటి ప్రాజెక్టులు అయితే కట్టిన దాఖలాలు లేవు అని కూడా అంటున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున తెచ్చిన అప్పులు ఆ డబ్బులు ఎటు పోయాయి అన్నదే మేధావులతో సహా అంతా గగ్గోలు పెడుతున్న విషయంగా ఉంది.

పోనీ దేశంలో ఈ అప్పుల వల్ల ప్రధాన రంగాలకు సర్దుబాటు చేసి దేశ ప్రజలకు ఉపశమనం కలిగించారా అంటే అదీ లేదు అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా వంట గ్యాస్ నాలుగైదు రెట్లు పెంచేశారు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఎపుడో ఆకాశాన్ని అంటాయి. వీటి పెరుగుదల వల్ల వచ్చిన ముప్పయి లక్షల కోట్ల రూపాయలు ఎటు వైపు వెళ్ళాయి అన్నది మరో చర్చగా ముందుకు వస్తోంది.

దేశంలో అప్పుల మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం మండిపడుతున్నారు. దేశంలో నరేంద్ర మోడీ పాలనలో అభివృద్ధి పూర్తిగా వెనక్కి పోయింది అని అన్నారు. 2004 నుంచి 2014 మధ్యలో దేశ జీడీపీ 6.8 గా ఉంటే విశ్వగురుగా కితాబు అందుకుంటున్న మోడీ పాలనలో అది కాస్తా 5.8గా మారింది అని అన్నారు. పదేళ్ళ కాలం అంతా అబద్ధపు ప్రచారంతో మోడీ పాలన సాగిందని కేసీఆర్ విమర్శించారు.

దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు అవి ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. అలాగే విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ప్రతీ ఇంటికీ పదిహేను లక్షలు ఇస్తామని చెప్పారు అది కూడా జరగలేదు అన్నారు. అలాగే స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా ఏమయ్యాయని ప్రశ్నించారు వికసిత్ భారత్ అన్నారు కానీ ఏమీ లెదని విమర్శించారు.

బీజేపీ అజెండాలో పేదలు రైతులు గిరిజనులు ఎస్సీల గురించి ఎక్కడా ఉండదని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ తరఫున ప్రధానంగా ఉన్న నరేంద్ర మోడీ గడచిన పదేళ్ల కాలంలో అందమైన నినాదాలు ఎన్నో చెప్పారని తీరా ఆయన పాలనలో జరిగింది అయితే ఏమీ లేదని అన్నారు.

మరోసారి నాలుగు వందల సీట్లతో అధికారం అని అంటున్న బీజేపీ కనుక మళ్ళీ నెగ్గితే మాత్రం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రమే నాలుగు వందలకు పెంచుతారని ఆయన సెటైర్లు వేశారు. ఇంతకు మించి బీజేపీ ప్రగతి ఏమీ లేఅదని అన్నారు. దేశంలో పదేళ్ళలో ప్రగతి పూర్తిగా కుంటుబడింది అని ఆయన అన్నారు. మొత్తానికి చూస్తూంటే బీజేపీ పదేళ్ళ అభివృద్ధి మీద మేధావులు రాజకీయ పార్టీల నుంచి చర్చ అయితే సాగుతోంది. దానికి బీజేపీయే సరైన సమాధానం చెప్పాల్సి ఉంది అని అంటున్నారు.