Begin typing your search above and press return to search.

370/370.. మోదీ ఈ లెక్క వెనుక ఉన్న కథ పెద్దదే

మరీ ముఖ్యంగా 370.. 370 అనడంలో ఓ పెద్ద రహస్యం దాగి ఉందని స్పష్టమవుతోంది.

By:  Tupaki Desk   |   19 Feb 2024 5:28 AM GMT
370/370.. మోదీ ఈ లెక్క వెనుక ఉన్న కథ పెద్దదే
X

ప్రధాని మోదీ మొన్నటివరకు ఈసారి ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొడతామని మాత్రమే చెప్పారు.. కొద్ది రోజుల నుంచి మాత్రం 370, 370 అని కలవరిస్తున్నారు. తమకు ‘370’ సీట్లు ఖాయం అంటున్నారు. అది కూడా బీజేపీ ఒక్కటే ఇన్ని సీట్లు సాధిస్తుందని.. ఎన్డీఏ కూటమితో కలుపుకొంటే మాత్రం 400 సీట్లు దాటుతాయని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా 370.. 370 అనడంలో ఓ పెద్ద రహస్యం దాగి ఉందని స్పష్టమవుతోంది. అదికూడా సెంటిమెంట్ తో కూడిన భావోద్వేగ పరమైన అంశమని తెలుస్తోంది.

శ్యామా ప్రసాద్ కు నివాళి అంటూ

శ్యామాప్రసాద్ ముఖర్జీ.. ప్రస్తుత బీజేపీ పూర్వ రూపమైన జన సంఘ్ వ్యవస్థాపక నాయకుడు. ఆయన చేసిన పోరాటాల్లో మరీ ముఖ్యమైనది జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్ 370 రద్దు. ఒకే దేశంలో ద్వంద సిద్ధాంతాలు ఎందుకంటూ ఆయన ఉద్యమించారు. అంటే.. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని నినదించారు. కశ్మీర్ సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించి అరెస్టు కూడా అయ్యారు. జీవించి ఉన్నంత కాలం ఈ అంశంపైనే పోరాడారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ.

వాస్తవానికి ఈయన తొలుత కాంగ్రెస్ నాయకుడే. స్వాతంత్ర్యానికి పూర్వం నెహ్రూ మంత్రివర్గంలో వాణిజ్య శాఖకు మంత్రిగా ఉన్నారు. కానీ, పాక్ నాయకుడు లియాఖత్ అలీతో నెహ్రూ ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ పదవిని వదులుకున్నారు. ఈ తర్వాత ఆర్ఎస్ఎస్ తో చర్చించి 1951లో జన సంఘ్ ను స్థాపించారు. 1953లో కశ్మీర్ సరిహద్దులో నిరాహార దీక్షకు వెళ్తుండగా శ్యామా ప్రసాద్ ను అరెస్టు చేశారు. అదే ఏడాది ఆయన చనిపోయారు. అప్పటికి ముఖర్జీ వయసు 52 ఏళ్లు మాత్రమే.

2019లో రద్దు చేసిన మోదీ

జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్ 370ని మోదీ ప్రభుత్వం రెండోసారి గెలిచిన కొద్ది రోజులకే అంటే.. 2019లో రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ గా విభజించి కేంద్ర పాలన విధించింది. ఇలా.. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నివాళి అర్పించామని బీజేపీ నేతలు చెబుతుంటారు.

ఇప్పుడిదే సింబాలిక్ గా మోదీ ‘‘370 సీట్లు’’ సాధిస్తామని అంటున్నారు. పార్లమెంటులో, బీజేపీ కార్యవర్గ సమావేశాల్లోనూ ఇదే విషయం గట్టి చెప్పారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో ఆర్టికిల్ 370 రద్దును ఓ అంశంగా చూపించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇదే కోణంలో రెండు రోజుల కిందట బీజేపీ సమావేశాల్లో 370 నంబరు అనేది సెంటిమెంట్ అని చెప్పడాన్ని గుర్తుచేస్తున్నారు.

ఓవైపు అయోధ్య.. మరోవైపు కశ్మీర్

ఇప్పటికే అయోధ్యలో రామాలయం ప్రారంభం ఉత్తరాదిన మేలు చేస్తుందని బీజేపీ భావిస్తోంది. దీనికితోడు ఆర్టికిల్ 370 రద్దునూ ప్రస్తావించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అందులోనూ కశ్మీర్ అంశం ఎప్పుడూ భావోద్వేగపరమైనదే. ఈ నేపథ్యంలో రెండింటినీ కలిపి ప్రచారం చేసే వీలుంది. దీంతోపాటు బీజేపీ కార్యకర్తలకు ఎంతో ఇష్టుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ కల నెరవేర్చామని చెబుతూ వారిలో స్ఫూర్తినింపి ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసేలా ప్రేరేపించనున్నారని అర్థమవుతోంది.