Begin typing your search above and press return to search.

మరొకరు పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తున్నారు.. ఫర్లేదు మోడీజీ డోంట్ కేర్

ఆ ఘటనలో కానీ.. తాను పెద్దగా ఇష్టపడని అంశాల మీద ఎవరెంత గొంతు చించుకున్నా ఆయన పట్టించుకోరన్న విషయం మరో ఉదంతాన్ని చూసినప్పుడు దేశ ప్రజలకు అర్థమైంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 5:01 AM GMT
మరొకరు పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తున్నారు.. ఫర్లేదు మోడీజీ డోంట్ కేర్
X

నిద్ర పోతున్న వారిని సులువు. నిద్ర నటించే వారిని లేపటం అంత తేలికైన విషయం కాదు. భారతదేశంలోని మారుమూల ప్రాంతంలో ఏదైనా ఒక పెద్ద ఉదంతం చోటు చేసుకున్నా.. ఒక విషాద ఘటన జరిగినా ఇట్టే స్పందిస్తూ.. తాను ఆ అంశాన్ని పరిశీలిస్తున్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేస్తుంటారు ప్రధాని మోడీ. నిజానికి దేశ ప్రజలకు ఇదో కొత్త అనుభవం. ఎందుకంటే.. దేశంలో ఓవైపు తగలబడిపోతున్నా వెంటనే స్పదించని ప్రధానమంత్రుల్ని చూసిన దేశ ప్రజలకు.. అందుకు భిన్నంగా ఘటన జరిగినంతనే సోషల్ మీడియాలో రియాక్టు కావటం.. తన స్పందనను తెలియజేసి.. మీకు నేనున్నా అన్న భరోసాను ఇచ్చే మొదటి ప్రధానమంత్రిగా మోడీ సుపరిచితులు.

అలాంటి మోడీ.. కొన్ని అంశాల మీద ఎంత రగడ జరుగుతున్నా.. దేశ ప్రజలు స్పందిస్తున్నా.. చర్యలు తీసుకోమన్నా లైట్ తీసుకోవటం కనిపిస్తుంది. అప్పట్లో మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకి.. ఢిల్లీ సరిహద్దుల వద్ద నెలల తరబడి నిరసన తెలిపిన వైనం తెలిసిందే.ఆ ఘటనలో కానీ.. తాను పెద్దగా ఇష్టపడని అంశాల మీద ఎవరెంత గొంతు చించుకున్నా ఆయన పట్టించుకోరన్న విషయం మరో ఉదంతాన్ని చూసినప్పుడు దేశ ప్రజలకు అర్థమైంది.

భారత రెజ్లింగ్ మహిళా క్రీడాకారులు(వారిలో ఒలింపిక్ విజేతలు ఉన్నారు) ఒక తీవ్ర అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధినేత బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఆరోపిస్తూ వారు నిరసన గళాన్ని విప్పారు. దీనిపై స్పందించాలని.. చర్యలు తీసుకోవాలంటూ వారు ఆందోళన చేపట్టారు. మహిళా రెజ్లర్లు లేవనెత్తిన అంశం మీద రియాక్టు కావటానికి ప్రధాని మోడీకి ఎలాంటి అభ్యంతరం ఉండదనే చెప్పాలి. కానీ.. తమ పార్టీకి చెందిన బ్రిజ్ భూషణ్ మీద చర్యలు తీసుకోవటానికి సుతారం ఇష్టపడరు. ఎందుకుంటే.. యూపీలో ఆయన కారణంగా నాలుగైదు ఎంపీ సీట్లు ఆధారపడి ఉంటాయన్నది రాజకీయ వర్గాలు చెప్పే మాట.

మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తి మీద చర్యలతో వచ్చే లాభంతో పోలిస్తే.. నాలుగైదు ఎంపీ సీట్లే ఎక్కువన్న లెక్కలు మోడీ ఇమేజ్ ను మసకబారేలా చేస్తాయన్నవిమర్శ ఉంది. దాన్ని బలం చేసేలా ఆయన తీరు ఉండటం షాకింగ్ గా మారింది.ఎందుకుంటే.. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద బాధిత రెజర్లు మాత్రమే కాదు పురుష రెజ్లర్లు సైతం రియాక్టు కావటం.. ఆందోళనలో మమేకం కావటం.. వారికి వివిధ క్రీడా రంగాలకు చెందిన వారు సైతం తమ మద్దతు తెలిపినప్పటికీ.. మోడీ కించిత్ చలించలేదు.

రాజకీయంగా డ్యామేజ్ అంతకంతకూ ఎక్కువ అవుతుందన్న భావన కలిగిందేమో కానీ ఆ మధ్యలో కేంద్రం రియాక్టు అయి.. విచారణ చేపడతామని.. బ్రిజ్ భూషణ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ కొన్ని హామీల్ని ఇవ్వటంతో.. అప్పటికే రోడ్ల మీద ఆందోళనలు చేసి.. చేసి అలిసిపోయిన క్రీడాకారులు బ్రేక్ ఇచ్చారు. కట్ చేస్తే.. క్యాలెండర్ లోనెలలు మారాయే తప్పించి బ్రిజ్ భూషణ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ కు సహాయకుడిగా వ్యవహరించే సంజయ్ సింగ్ ఎన్నిక కావటం విస్తుపోయేలా చేసింది.

తన కనుసైగలకు తగ్గట్లే రియాక్టు అయ్యేలా పరిస్థితులు ఉండటాన్ని పోరాట పటిమ కలిగిన క్రీడాకారుల్ని సైతం షాక్ తినేలా చేసింది. దీంతో.. రెజ్లింగ్ క్రీడ నుంచి సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించేస్తే.. ఆమె నిర్ణయానికి స్పందనగా మరో రెజ్లర్ బజ్ రంగ్ పునియా తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా తాజాగా పారా రెజ్లర్ వీరేందర్ సింగ్ సైతం తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

2021లో అతడికి పద్మశ్రీ పురస్కారం లభించింది. రాష్ట్రపతి భవన్ లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తర్వాతి రోజే.. పారా అథ్లెట్లకు న్యాయం చేయాలని హర్యానా ముఖ్యమంత్రి ఇంటి ముందు అవార్డులతో నిరసన చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా తన సోదరిమణుల కోసం.. వారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తన పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకంపనల్ని క్రియేట్ చేస్తోంది. దేశంలోని మిగిలిన రంగాలకు చెందిన క్రీడాకారులు సైతం నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన పిలుపునిస్తున్నారు. ఇంత జరిగినా సరే.. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం రెజ్లింగ్ సమాఖ్యలో చోటు చేసుకుంటున్న అంశాల మీద కానీ.. రెజ్లర్లు లేవనెత్తిన డిమాండ్ల మీద కానీ.. బ్రిజ్ భూషన్ మీద కానీ స్పందించకపోవటం గమనార్హం. ఎవరెంత గొంతు చించుకున్నా.. కొన్ని అంశాల్ని ప్రధాని మోడీ పిచ్చ లైట్ తీసుకోవటానికి ఆయనకు అంతటి భరోసాను ఇస్తున్నదెవరంటారా?