Begin typing your search above and press return to search.

మోడీ మేనియా: రాముడి బాట‌లో రాజ్యాంగ సంస్థ‌లు!

ఇత‌ర రాష్ట్రాల్లోని బీజేపీయేత‌ర స‌ర్కార్ల‌పై గ‌వ‌ర్న‌ర్లు తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదాస్పంద‌గా మారుతున్నాయ‌ని సుప్రీంకోర్టు ఇటీవ‌ల వ్యాఖ్యానించింది.

By:  Tupaki Desk   |   27 Nov 2023 3:30 PM GMT
మోడీ మేనియా:  రాముడి బాట‌లో రాజ్యాంగ సంస్థ‌లు!
X

రాజ్‌భ‌వ‌న్‌.. రాష్ట్ర ప‌రిధిలో ఉండే అతి పెద్ద రాజ్యాంగ సంస్థ‌. కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా ధ‌నిక‌, పేద విక్ష‌ణ చూప‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌నే స‌త్సంకల్పంతో రాజ్‌భ‌వ‌న్‌ల‌ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ అధికారాల‌ను కూడా క‌ల్పించారు. రాజ్యాంగాన్ని అమ‌లు చేసే బాధ్య‌త‌ను కూడా ఇచ్చారు. ప్ర‌త్యేక క్లాజులు, ఆర్టిక‌ల్స్ ఏర్పాటు చేశారు. అయితే.. గ‌త కొన్నాళ్లుగా దేశ‌వ్యాప్తంగా రాజ్‌భ‌వ‌న్‌లు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, కేర‌ళ స‌హా అనేక రాష్ట్రాల్లో రాజ్‌భ‌వ‌న్ కేంద్రంగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై సుప్రీంకోర్టు కూడా ఇటీవ‌ల మండిప‌డింది.

కేంద్రంలోని పాల‌కుల మెప్పుకోసం.. ప‌రిత‌పిస్తున్న తీరు రాజ్‌భ‌వ‌న్‌ల‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇత‌ర రాష్ట్రాల్లోని బీజేపీయేత‌ర స‌ర్కార్ల‌పై గ‌వ‌ర్న‌ర్లు తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదాస్పంద‌గా మారుతున్నాయ‌ని సుప్రీంకోర్టు ఇటీవ‌ల వ్యాఖ్యానించింది. ఇదిలావుంటే.. ఇప్పుడు ఏపీలో చోటు చేసుకున్న ప‌రిణామం.. నివ్వెర‌పోయేలా చేసింది. మ‌తాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సి న రాజ్‌భ‌వ‌న్‌.. `రాముడి బాట‌` ప‌ట్టింద‌నే వ్యాఖ్య‌లు ప్ర‌జాసంఘాల నుంచి ప్ర‌జాస్వామ్య వాదుల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తిరుప‌తికి వ‌చ్చారు.

ప్ర‌ధానిని ఏపీ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌.. స్వాగ‌తించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఆయ‌న జ్ఞాపిక అందించారు. ఇది `అయోధ్య రాముడి` చిత్త‌రువు కావ‌డ‌మే ఇప్పుడు వివాదానికి దారితీసింది. జ్ఞాపిక ఇవ్వ‌డం త‌ప్పుకాకున్నా.. రాముడి చిత్త‌రువుతో కూడిన(దారు/చెక్క‌) శిల్పాన్ని ఇవ్వ‌డం రాజ్యాంగ సంస్థ‌కు త‌గునా? అనేది ప్ర‌శ్న‌. గ‌వ‌ర్న‌ర్‌లు ఇచ్చే జ్ఞాపిక‌లు ఎప్పుడూ.. కులాలు, మ‌తాలకు అతీతంగా ఉండాల్సి ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అంటే.. ఆయా రాష్ట్రాల సంస్కృతుల‌ను ప్ర‌తిబింబించే చిత్త‌రువులు, లేదా క‌ళాఖండాల‌ను ఇవ్వొచ్చు. లేదా వ‌స్త్రాల‌ను బ‌హూక‌రించ‌వ‌చ్చు.

కానీ.. తాజా ఘ‌ట‌న‌లో మాత్రం గ‌వ‌ర్న‌ర్ న‌జీర్‌.. ప్ర‌ధాని మోడీకి `అయోధ్య రాముడి`దారు శిల్పాన్ని జ్ఞాపిక‌గా ఇవ్వ‌డాన్ని ప్ర‌జాస్వామ్య వాదులు త‌ప్పుబ‌డుతున్నారు. మోడీ మేనియాలో రాజ్యాంగ బ‌ద్ధ సంస్థ‌లు కూరుకుపోతున్నాయా? అనే సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. `లౌకిక‌, ప్ర‌జాస్వామ్య` దేశంలో ఒక మ‌తానికి అనుకూలంగా రాజ్‌భ‌వ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వాస్త‌వానికి రాజ్‌భ‌వ‌న్‌లు విమ‌ర్శ‌ల‌కు వివాదాల‌కు దూరంగా ఉండాల్సి ఉంది. కానీ, రానురాను.. వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నాయనే వాద‌న సుప్రీంకోర్టు స్థాయిలోనే వినిపిస్తుండ‌డాన్ని వారు గుర్తు చేస్తున్నారు.