Begin typing your search above and press return to search.

అప్పుడు రామ సేతు.. ఇప్పుడు కచ్చతీవు రచ్చ రంబోల!

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ప్రచారంలో తలమునకలై ఉన్నాయి.

By:  Tupaki Desk   |   1 April 2024 6:03 AM GMT
అప్పుడు రామ సేతు.. ఇప్పుడు కచ్చతీవు రచ్చ రంబోల!
X

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, దూషణలు, వాగ్బాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయాలను కూడా ఇప్పుడు ప్రస్తావిస్తూ కొత్త చర్చకు ఆయా పార్టీల నేతలు తావిస్తున్నారు.

తాజాగా భారత్, శ్రీలంక మధ్యలో హిందూ మహాసముద్రంలోని రామేశ్వరం దీవికి అతి సమీపంలో ఉన్న కచ్చతీవు వ్యవహారం ఇప్పుడు ముదిరిపాకాన పడుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కచ్చతీవును అంశాన్ని కెలకడం, ఈ దీవిని 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వమే శ్రీలంకకు ఇచ్చిందంటూ తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమాచార హక్కు చట్టం ద్వారా కచ్చతీవుపై సమాచారం తీసుకోగా 1974లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ.. అప్పటికి భారత్‌ లో ఉన్న కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారని వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్ర విమర్శలను ఎక్కుపెట్టారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా దీటుగా బదులిస్తోంది. మరి బంగ్లాదేశ్‌ తో సరిహద్దు ఒప్పందం సందర్భంగా 111 భారత్‌ ప్రాంతాలను బంగ్లాదేశ్‌ కు ఎందుకిచ్చారని మోదీని నిలదీస్తోంది.

ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ కచ్చతీవు వ్యవహారంపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. కచ్చతీవు కేవలం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆకస్మాత్తుగా తెరమీదకొచ్చిన అంశం కాదని తెలిపారు. పార్లమెంటు, కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉందన్నారు. కచ్చతీవు వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వానికి 21 సార్లు తాను జవాబు ఇచ్చానని వెల్లడించారు. అప్పటి ప్రధానులు భారత భూభాగాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడులోని డీఎంకే పార్టీపైనా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ విరుచుకుపడ్డారు. కచ్చతీవును అప్పగించేటప్పుడు నాడు అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందన్నారు. కానీ డీఎంకే తమకు తెలియదని నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ లేకుండా భారత భూభాగాలను వేరే దేశానికి అప్పగించడానికి అవకాశం లేని నేపథ్యంలో కచ్చతీవుపై ఒక పరిష్కారానికి రావాల్సి ఉంటుందని జైశంకర్‌ తెలిపారు. ఈ వ్యవహారంపై శ్రీలంక ప్రభుత్వంతో కలిసి నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు.

కాగా కచ్చతీవు చాలా చిన్నదీవి. ఇక్కడ జనం ఎవరూ ఉండటం లేదు. అయితే మత్స్య సంపద మాత్రం పుష్కలంగా ఉంది. భారతీయ మత్స్యకారులు ముఖ్యంగా తమిళనాడుకు చెందినవారు చేపల వేట సందర్భంగా తమకు తెలియకుండానే శ్రీలంక జలాల్లో ప్రవేశిస్తున్నారు. దీంతో శ్రీలంక మన మత్స్యకారులను బంధిస్తోంది. అలాగే కచ్చతీవు సమీపంలోకి వెళ్లినవారిని కూడా వదిలిపెట్టడం లేదు. వాస్తవానికి కచ్చతీవును శ్రీలంకకు అప్పగించినా ఒప్పందం ప్రకారం మన మత్స్యకారులు కూడా చేపల వేట సాగించుకోవచ్చు. కానీ శ్రీలంక ఇందుకు తూట్లు పొడుస్తోంది.

తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కచ్చతీవు ద్వీపం గురించి మాట్లాడారు. 1973 వరకు కచ్చతీవు మనదేశంలోనే ఉందన్నారు. 1974లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కచ్చతీవును శ్రీలంకకు ఇచ్చేశారని.. దీనివల్ల ఆ మూల్యాన్ని ఇప్పటికీ చెల్లించుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు.