Begin typing your search above and press return to search.

జగన్ ను మోడీ ఏమీ అనట్లేదనే వారు.. ఇప్పుడేమంటారు?

ఇదిలాఉంటే తాజాగా కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ రియాక్టు అయ్యారు.

By:  Tupaki Desk   |   4 April 2024 4:53 AM GMT
జగన్ ను మోడీ ఏమీ అనట్లేదనే వారు.. ఇప్పుడేమంటారు?
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పల్లెత్తు మాట అనలేదని.. అంటే ఆయన ఏపీ సీఎంకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నిజంగానే ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి.. ఆయన ప్రభుత్వంపైనా మోడీ మాష్టారు అసలేం అనలేదా? అన్న ప్రశ్నలోకి వెళితే.. సమాధానం ఆసక్తికరంగా మారుతుంది. చిలకలూరిపేట సభలో కానీ ఇతర వేదికల మీద కానీ సీఎం జగన్ ను ప్రధాని మోడీ పల్లెత్తు మాట అనలేదనే వాదనలో అర్థం లేదంటున్నారు. అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. ఒకవేళ.. మోడీ కానీ ఇప్పుడు సీఎం జగన్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేస్తే.. అది ఆయనకే తిప్పలు తెచ్చిపెట్టటం ఖాయం.

ఎందుకంటే.. ఎన్నికల వేళలో విమర్శలు చేస్తున్నప్పుడు.. గడిచిన ఐదేళ్లలో ఏం చేస్తున్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో మోడీ పడతారు. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వటానికి అస్సలు ఇష్టపడని మోడీ మాష్టారు.. ఆచితూచి మాట్లాడటం వెనుక అసలు సంగతి ఇదేనన్న మాట వినిపిస్తోంది. జగన్ సర్కారుపై మోడీ ఆచితూచి మాట్లాడితే.. ఆయన నీడగా చెప్పే అమిత్ షా తీవ్రంగానే మాట్లాడటాన్ని ఎందుకు ప్రస్తావించరు? అన్నది ప్రశ్న.

ఇదిలాఉంటే తాజాగా కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ రియాక్టు అయ్యారు. ఏపీ పరిస్థితులపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి.

- మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయ్ సమయం నుంచి ప్రస్తుత ప్రధాని మోడీ వరకు చంద్రబాబుతో కలిసి పని చేసిన అనుభవం ఉంది. కూటమి రెండుసార్లు కేంద్రంలో.. రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది.

- ఏపీలో బీజేపీతో పొత్తు లేకపోతే కూటమి అసంపూర్తిగా ఉంటుందని.. కలిసి పోటీ చేస్తే మరింత శక్తివంతంగా తయారవుతుందని చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లు భావించి ఉండొచ్చు.

- ప్రస్తుతం ఏపీ ప్రజలు జగన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన మౌలిక వసతుల్ని కల్పించలేదు.

- ఏపీకి కొత్త పరిశ్రమలురాలేదు. గుజరాత్ తర్వాత సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీ.. ఆ రంగంలో అద్భుతాలు చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్ని జగన్ సర్కారు వినియోగించుకున్నది లేదు.

- వేలాది కోట్ల రూపాయిలు అప్పులు చేసి.. ఏపీని పూర్తిగా అప్పుల ఊబిలోకి తోసింది. అప్పులకు కేంద్రాన్ని బాధ్యుల్ని చేయలేరు. ఏపీని డెవలప్ చేయటం కోసం బీజేపీ.. టీడీపీ.. జనసేన కూటమికి ఓటు వేయాలి. ఏపీని ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చేయలేదు. దేశంలో మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్స్ పార్కులు కేటాయిస్తే అందులో ఏపీకి ఒకటి ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన డబ్బులన్నీ ఇచ్చాం.

ఇలా ఏపీ రాజకీయ పరిణామాలు.. ముఖ్యమంత్రి పాలన గురించి కేంద్ర మంత్రి నోటి నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు చూస్తే.. మోడీ మాష్టారు ఏమీ అనలేదని జబ్బలు చరుచుకునే వారు.. తాజాగా కేంద్ర మంత్రి నోటి నుంచి వచ్చిన మాటల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోమంటే అంతకుమించిన తప్పు మరొకటి ఉండదు. అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.