Begin typing your search above and press return to search.

శభాష్.. అంటూ మోడీ ప్రశంసించిన మాధవీలత ఏం మాట్లాడారు?

హైదరాబాద్ లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తొలి మహిళగా ఆమె ఇప్పటికే ఒక రికార్డును క్రియేట్ చేశారు

By:  Tupaki Desk   |   8 April 2024 9:30 AM GMT
శభాష్.. అంటూ మోడీ ప్రశంసించిన మాధవీలత ఏం మాట్లాడారు?
X

మాధవీలత. ఈ పేరు ఇప్పటికి చాలామందికి పరిచయం లేదు. బీజేపీ ఫైర్ బ్రాండ్ అభ్యర్థిగా.. కమలం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆమె టికెట్ దక్కించుకున్నారు. ఆమెను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే నాటికి ఆమె అధికారికంగా బీజేపీలో చేరింది కూడా లేదు. అయినప్పటికీ ఆమెకు టికెట్ ఓకే చేశారు. హైదరాబాద్ లోని విరంచి ఆసుపత్రి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆమె.. సనాతన ధర్మం గురించి.. హిందుత్వ గురించి.. హైదరాబాద్ రాజకీయం గురించి గుక్కు తిప్పుకోకుండా వివరిస్తారు.

ఒక నాట్యకారణిగా.. ఉద్యమకారిణిగా.. సమాజసేవ చేయటంతో పాటు ముస్లిం మహిళలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపటంలో ఆమె మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా పోరాటం చేయటంతో పాటు.. మంచి వాగ్దాటి ఉన్న ఆమెను ఏ ప్రశ్నను సంధించినా తడుముకోకుండా సమాధానాలు ఇవ్వటం ఆమెకు మాత్రమే సాధ్యం. తాజాగా ఒక జాతీయ టీవీ చానల్ లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి అతిధిగా వెళ్లిన ఆమె.. దాదాపు 1.45 గంటలకు పైనే తనను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పటమే కాదు.. తన మాటలు విన్న వారంతా కన్వీన్స్ అయ్యేలా చేయటం ఆమెకు మాత్రమే చెల్లుతుంది.

హైదరాబాద్ లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తొలి మహిళగా ఆమె ఇప్పటికే ఒక రికార్డును క్రియేట్ చేశారు. అంతేకాదు.. ఆమె పాల్గొన్న కార్యక్రమం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆమెను శభాష్ అంటూ కీర్తించటమే కాదు.. అన్ని ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలు ఇచ్చారంటూ మెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆమె టీవీ కార్యక్రమాన్ని అందరూ చూడాలంటూ ప్రధాని మోడీ సూచన చేయటం విశేషం.

‘‘మాధవీలతాజీ ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో మీరు చూపిన ప్రతిభ అద్భుతంగా ఉంది. మీరు విషయాలను చాలా స్పష్టంగా.. తర్కంతో.. ఎంతో ఇష్టంతో వివరించారు. మీకు నా అభినందనలు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూడాలి. చాలా ఆసక్తికర సమాచారం ఇందులో ఉంది’’ అంటూ పేర్కొన్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈసారి ఎన్నికల్లో 1.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారంటూ ఆమె వేస్తున్న అంరనా.. బీజేపీలో టికెట్ల కేటాయింపు ఎంత పారదర్శకంగా సాగుతుందన్న విషయాన్ని ఆమె చెప్పిన వైనం ఆకట్టుకునేలా సాగింది.

దాదాపు నలభై ఏళ్లుగా తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న అసదుద్దీన్ ఓవైసీకి విజయాలను తాను అడ్డుకుంటానని.. అతడు మోసంతోనే ఎన్నికల్లో గెలుస్తున్నట్లుగా ఆమె వాదిస్తున్నారు. దీనికి ఆమె వివరంగా సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి వరకు మోసపూరిత చర్యలతోనే గెలుస్తూ వచ్చారని.. ఈసారి మాత్రం ఓడిపోవటం ఖాయమని ఆమె ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ‘బోగన్ ఓట్లు ఉంటే 40 ఏళ్లు ఏమిటి.. 4000 సంవత్సరాల పాటు గెలవొచ్చు. ఏం చేస్తాం? మా దగ్గర బోగస్ ఓట్లు లేవు. ఓవైసీకి 6.2 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో ఒక ఓటరు కార్డు నెంబరు కొడితే ఆ పేరు రెండు చోట్ల కనిపిస్తుంది. ఒక్క చార్మినార్ ప్రాంతంలోనే 1.6 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇంతవరకు ఓవైసీ తప్పుడు మార్గాల్లోనే గెలుస్తూ వస్తున్నారు. ఆ విషయాన్ని చెప్పటానికి తానేమీ భయపడను’ అంటూ చెప్పిన వైనం అందరిని ఆకట్టుకుంటోంది.

ఈ కార్యక్రమంలో పాతబస్తీ రాజకీయం గురించి.. హైదరాబాద్ లోని పరిస్థితులు.. పాతబస్తీలో డెవలప్ మెంట్ ఎంతలా వెనుకబడిన విషయాలతో పాటు బీజేపీ గురించి.. ప్రధానమంత్రి మోడీ గురించి మనసు దోచేలా మాట్లాడారు. ఆమె మాటల్ని విన్న తర్వాత ఎవరైనా ఆమె మాటలకు ఫిదా కావటమే కాదు.. కొత్త తరహా రాజకీయ వేత్త తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చారన్న భావన కలుగకమానదు. తనకు టికెట్ ఇవ్వటంపై గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గుర్రుగా ఉన్నారన్న విషయాన్ని సైతం ఆమె తెలివిగా సమాధానం ఇచ్చారన్నది ఈ ప్రోగ్రాంలో మాధవీలత చెప్పిన సమాధానాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.