Begin typing your search above and press return to search.

ఇది నిజమా.. యోగిని మోదీ, షా పక్కనపెట్టారా?

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

By:  Tupaki Desk   |   4 April 2024 6:02 AM GMT
ఇది నిజమా.. యోగిని మోదీ, షా పక్కనపెట్టారా?
X

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. బీజేపీకి సొంతంగా 300 స్థానాలు, ఎన్డీయే కూటమికి 400 స్థానాలు ఇవ్వాలని బీజేపీ నేతలు ప్రజలను కోరుతున్నారు.

బీజేపీ ఆశ నెరవేరాలంటే కీలక పాత్ర ఉత్తరప్రదేశ్‌ దే. ఈ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా ఏకంగా 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ ఏకంగా 62 ఎంపీ స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఈసారి కూడా ఏకపక్ష విజయాన్ని సాధించాలని కంకణం కట్టుకున్న ప్రధాని మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్‌ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ భారీ మెజారిటీలతో విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుపొందడంలో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ద్వయం 80 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.

అయితే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, మోదీ తర్వాత భావి ప్రధానిగా కితాబులందుకుంటున్న యోగి ఆదిత్యనాథ్‌ చెప్పినవారిలో ఒక్కరికి కూడా సీటు ఇవ్వలేదనే వార్త హాట్‌ టాపిక్‌ గా మారింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కార్యవర్గం చెప్పినవారిని మోదీ, అమిత్‌ షా పట్టించుకోలేదని వివిధ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

బీజేపీలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తర్వాత అత్యంత శక్తిమంతుడైన నేతగా పేరున్న యోగి ఆదిత్యనాథ్‌ చెప్పినవారిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా సీటు ఇవ్వలేదని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దీంతో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల వ్యవహార శైలిపై యోగి ఆదిత్యనాథ్‌ నొచ్చుకున్నారని మీడియా సంస్థలు నివేదించాయి.

ఇప్పుడు ఈ అంశంపైనే ఉత్తరప్రదేశ్‌ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది.

యోగి ఆదిత్యనాథ్‌ ను విస్మరించిన ప్రధాని మోదీ, అమిత్‌ షాలు తమ సర్వేల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారని అంటున్నారు. సర్వేల మేరకే తాము అభ్యర్థులను ఎంపిక చేశామని అమిత్‌ షా కూడా ఇప్పటికే వెల్లడించారు.

సమీప భవిష్యత్తులో ఏదైనా విధానపరమైన విషయాలపై యోగి ఆదిత్యనాథ్‌ విభేదించకుండా ఉండటానికి, ఆయన ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడానికే ప్రధాని మోదీ, అమిత్‌ షా.. యోగి చెప్పినవారికి సీటు ఇవ్వలేదని టాక్‌ నడుస్తోంది.

వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు యోగి ఆదిత్యనాథ్‌ ను కాకుండా మరొకరిని సీఎంగా ఎంపిక చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాక్‌ గ్రౌండ్, యూపీ ప్రజల్లో యోగి ఆదిత్యనాథ్‌ పై ఉన్న సానుకూలతతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయనను సీఎంను చేశారని వార్తలు వచ్చాయి.