మహిళా బిల్లు తెస్తాం... మోడీ శపధం
ఇక 2027 లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే మోడీ ఎన్నికల ప్రిపరేషన్ మొదలెట్టారని అంటున్నారు.
By: Satya P | 29 April 2026 9:19 AM ISTఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లుకూ ఆమోద ముద్ర వేయించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం చూసింది. కానీ ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఒకే త్రాటి మీదకు రావడం వల్ల బిల్లు వీగిపోయింది. అయితే మహిళా బిల్లు ఎపుడు అమలు అవుతుంది అన్నది పెద్ద చర్చగా మారింది. బీజేపీ నేతలు అయితే మహిళా బిల్లుని తీసుకుని వస్తామని చెబుతూ వచ్చారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ దీని మీద బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది కూడా తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఆయన పర్యటిస్తూ మహిళా బిల్లు మీద గట్టి ప్రతిన పూనామని చెప్పారు.
వారి వల్లనే ఆగింది :
నరేంద్ర మోదీ వారణాసిలో రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు. ఈ సందర్భంగా యాభై వేల మంది మహిళలతో నిర్వహించిన ఒక భారీ మహిళా సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మహిళా బిల్లు మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలకు చట్ట సభలలో అవకాశాలు రాకుండా కాంగ్రెస్ టీఎంసీ ఎస్పీ వంటి పార్టీలు అడ్డుకున్నాయని విమర్శించారు. వారి వల్లనే మహిళా అమలులోకి రాలేదని మండిపడ్డారు.
కట్టుబడి ఉన్నామంటూ :
అయితే ఈ విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని మోడీ స్పష్టం చేయడం విశేషం. దేశ విధాన రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ అన్నారు. లోక్‌సభతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయడమే ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. దీని వల్ల వారంతా చట్ట సభలలో తమ గొంతు వినిపించే అవకాశాలు ఉంటాయని మోడీ చెప్పారు.
యూపీ ఎన్నికలకు రెడీ :
ఇక 2027 లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే మోడీ ఎన్నికల ప్రిపరేషన్ మొదలెట్టారని అంటున్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసి లో మోడీ అతి పెద్ద మహిళా సభను నిర్వహించడం వేలాది మంది మహిలలతో కలసి ఆయన పాలు పంచుకోవడం అక్కడ మహిళా బిల్లు గురించి మాట్లాడడం పైగా యూపీలో కీలకమైన రాజకీయ పార్టీగా ఉన్న ఎస్పీని మహిళా బిల్లు విషయంలో దోషిగా చూపించడం ఇవన్నీ రాజకీయ వ్యూహాలే అని అంటున్నారు. దేశంలో ఇపుడే అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. దాంతో యూపీ ఎన్నికలకు మోడీ సిద్ధపడడం చూస్తూంటే బీజేపీ చాలా ముందుంది అని అంటున్నారు.
అభివృద్ధికి శ్రీకారం :
వారణాసిలో సుమారు ఆరు వేల 350 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను నరేంద్ర మోడీ ప్రారంభించి శంకుస్థాపన చేయడం ద్వారా ఫోకస్ యూపీకి శ్రీకారం చుట్టారు. ఇక ఈ ప్రాజెక్టులలో రైలు, రోడ్డు, నీరు, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం పట్టణ మౌలిక సదుపాయాలతో సహా కీలక రంగాలు ఉండడం విశేషం. మోడీ తన వారణాసి పర్యటనలో భాగంగా కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించడం ద్వారా యూపీ ప్రజలకు ఒక కీలక సందేశం వారణాసి నుంచే పంపించనున్నారు.
