ప్రోటోకాల్ పక్కన పెట్టి పెళ్లి మండపంలోకి వెళ్లి ప్రధాని మోడీ ఆశీస్సులు
సామాన్యుల మనసుల్ని దోచుకునే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ ముందుంటారు.
By: Garuda Media | 15 April 2026 11:31 AM ISTసామాన్యుల మనసుల్ని దోచుకునే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ ముందుంటారు. నిజానికి ఆయన ప్రధాని హోదాలో ఉన్నప్పటికి సామాన్యుడి మాదిరి ఆయన తీరు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది.ఆయన తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎంత నిశితంగా గమనిస్తారన్న విషయం పలు సందర్భాల్లో ఆయన స్పందించే తీరుతో అర్థమవుతుంటుంది. సాధారణంగా ప్రధానమంత్రి హోదాలో ఉన్న పెద్ద మనిషి.. చిన్న విషయాల్ని అస్సలు పట్టించుకోరు అనే కన్నా.. పట్టదన్నట్లుగా ఉంటారు. కానీ.. మోడీ తీరు ఇందుకు భిన్నం. తాజాగా ఆయన అలాంటి తీరునే ప్రదర్శించి.. మోడీ మేజిక్ మరోసారి చూపించారు.
తాను బస చేసిన చోటే జరుగుతున్న పెళ్లి మండపానికి భద్రతా ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి వెళ్లటమే కాదు.. నూతన వధూవరులను ఆశీర్వదించటమే కాదు.. తన కారణంగా పెళ్లి వారు ఎదుర్కొన్న ఇబ్బందులకు నిండు మనసుతో సారీ చెప్పిన తీరు.. అక్కడి వారందరిని విపరీతంగా ఆకట్టుకోవటమే కాదు.. అందరూ అభినందిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించి అసలేం జరిగిందంటే..
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది. ఉత్తర బెంగాల్ లో మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. దీంతో.. ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ ఈ నెల 12న (శనివారం) సిలీగుడికి వెళ్లారు. అక్కడి బగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. ఎయిర్ పోర్టు నుంచి 13 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించిన ఆయన.. రాత్రి బస కోసం సిలీగుడి పరిసర ప్రాంతంలోని ‘మే ఫెయిర్ టీ రిసార్ట్’లో ఏర్పాట్లు చేశారు.
దీంతో.. శుక్రవారం నుంచి ఆ రిసార్ట్ చుట్టుపక్కల ప్రాంతమంతా భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఉత్తర బెంగాల్కు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకు పెళ్లి అదే రిసార్ట్ లో జరుగుతోంది. దీంతో.. రిసార్ట్ కు వచ్చిన అతిధులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానమంత్రి స్వయంగా బస చేస్తున్న వేళ.. కఠినమైన భద్రతా ఏర్పాట్లతో పెళ్లి వారికి చుక్కలు కనిపించాయి.
వారి కదలికలపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రధాని మోడీ.. సెక్యూరిటీ ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి.. పెళ్లి మండపానికి వెళ్లి.. అక్కడి వధూవరులను ఆశీర్వదించటమే కాదు.. తన వల్ల జరిగిన ఇబ్బందిని దయచేసి క్షమించాలని కోరటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటివరకు పెళ్లి వారు పడిన ఇబ్బందులు పక్కకు వెళ్లిపోవటమే కాదు.. ప్రధానమంత్రే స్వయంగా తమ ఇబ్బందుల్ని గుర్తించారన్న ఆనందం వారిని ఉక్కిరిబిక్కిరి చేసేలా చేసింది. తనకు బస ఏర్పాటు చేసిన చోటుకు నేరుగా వెళ్లకుండా.. తన చుట్టూ ఏం జరుగుతుందన్న విషయాన్ని గమనించటం.. అందుకు తగ్గట్లు రియాక్టు కావటంలో మోడీ తీరు ఇంకెవరికి అంత తేలికగా వంటబట్టేది కాదని మాత్రం చెప్పక తప్పదు.
