Begin typing your search above and press return to search.

మోడీ సార్ ఈసారీ సారీ అనిపించారా ?

ఇక అమరావతి రాజధాని పనులు పునర్ ప్రారంభానికి ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. ఆయన వచ్చి దానిని పూర్తి చేశారు.

By:  Tupaki Desk   |   3 May 2025 8:59 AM IST
మోడీ సార్ ఈసారీ సారీ అనిపించారా  ?
X

కేంద్రంలో బలమైన నాయకుడిగా ఉంటూ గత పదకొండేళ్ళుగా ఒంటి చేత్తో భారత్ లాంటి సువిశాల దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా వరాల జల్లులు కురిపిస్తారు. మరీ ముఖ్యంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న చోట అయితే ఆయన చేతికి ఎముక లేనట్లుగా వ్యవహరిస్తారు. అటువంటి మోడీ ఏపీకి వస్తే ఏమి ఇచ్చారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది.

ఇక అమరావతి రాజధాని పనులు పునర్ ప్రారంభానికి ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. ఆయన వచ్చి దానిని పూర్తి చేశారు. అయితే ఇక్కడే అనేక పోలికలు ఫ్లాష్ బ్యాక్ కధలూ గుర్తుకు వస్తున్నాయి. 2015లో మోడీ అమరావతి రాజధానికి శంకుస్థాపనకు వచ్చినపుడు మట్టితో పాటు నీరు తెచ్చారు. ఆయన ఏ పవిత్ర ఉద్దేశ్యంతో తెచ్చినా అది కాస్తా భారీ విమర్శలకు గురి అయింది. అమరావతికి ఏదో ఇస్తారని ఎంతో మేలు చేస్తారని చూస్తే ఇదేనా ఇవ్వడం అన్నది అంతా విమర్శల రూపంలో చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరి దానిని గుర్తు చేసుకుని ఈసారి మోడీ జాగ్రత్తపడి ఉంటారని కీలక ప్రకటనలు చేస్తారని అంతా అనుకున్నారు. అయితే మోడీ జాగ్రత్తపడ్డారని అంటున్నారు. అదేంటి అంటే మట్టి నీరు తేకుండా అని సెటైర్లు వేస్తున్నారు. ఎందుకొచ్చిన తంటా అని ఆయన అనుకున్నారో లేక రెండోసారి శ్రీకారం చుడుతున్నాం కదా అని అవసరం లేదని అనుకున్నారో తెలియదు కానీ మామూలుగానే వచ్చి లక్షల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు.

ఆయన అరగంటకు పైగా చేసిన ప్రసంగంలో ఎక్కడా కొత్త ప్రకటనలు అయితే లేఅవు. కీలకమైన అంశాల మీద వరాలూ లేవు. పదేళ్ళలో ఏపీకి ఎంత చేసింది సోదాహరణంగా చెప్పారు. అమరావతిని దీవించారు. మూడేళ్ళలో తప్పకుండా ఏపీ కలలు సాకారం అవుతాయని నమ్మకంగా చెబుతూ తన ప్రసంగం ముగించారు.

దాంతోనే మళ్ళీ ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు. ఈసారి కూడా మోడీ నిరాశ పరచారు అని అంటున్నారు. సోషల్ మీడియాలో అయితే మోడీ ఏమీ ఏపీకి వరాలు ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారు. అయితే మోడీ ఏమి చేసినా లేక ఏమి ఇచ్చినా కూడా అది బహిరంగ సభలలో చెప్పరని పాలసీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్స్ పెట్టి వాటిని ప్రకటిస్తుందని గుర్తు చేస్తున్నారు.

ఇక అమరావతికి సంబంధించి ఆర్ధిక వనరులు సమకూర్చడం వెనక మోడీ ప్రభుత్వం అండదండలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా కేంద్రం భుజం కలిపి ఏపీ అభివృద్ధి కోసం పనిచేస్తుందని మోడీ హామీ ఇచ్చారు కదా అని ఆ పార్టీ వారు అంటున్నారు ఇక మోడీ నోటి నుంచి అమరావతి రాజధాని అన్న మాటను అయితే భూములు ఇచ్చిన రైతులు వినగలిగారు. కానీ అదే సమయంలో పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసి ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పలేదన్న నిరాశ వాళ్ళలోనూ ఉంది అంటున్నారు.

అయితే దీని మీద కూటమి నుంచి వస్తున్న స్పందన ఏంటి అంటే గెజిట్ నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందని ఇదంతా పరిపాలనకు సంబంధించిన అంశాలని వాటిని బహిరంగంగా ఎవరూ ప్రకటించరని అంటున్నారు. అమరావతికి మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దన్నుగా ఉందని ఇంతకంటే వేరే ప్రకటనలు ఎందుకు అని కూటమి నాయకులు అంటున్నారు. మొత్తానికి మోడీ అమరావతికి మళ్ళీ వచ్చారు. ఈసారీ సారీ అనిపించారా ఉసూరనిపించారా అంటే ఎవరి మాటలు వారివి ఎవరి వ్యాఖ్యానాలు వారివి అని అంటున్నారు.