తెంపరి ట్రంప్ ను డీల్ చేయాలంటే మోడీనే సరైనోడు
ప్రపంచానికి పెద్దన్న అమెరికాతో బాగుండేందుకు.. ఆ దేశంతో సత్ సంబంధాల కోసం ప్రపంచ దేశాలన్నీ వీలైనంత జాగ్రత్తగా ఉంటాయి. కిమ్ లాంటి ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారంతా ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండేవాళ్లే.
By: Tupaki Desk | 24 May 2025 11:10 AM ISTప్రపంచానికి పెద్దన్న అమెరికాతో బాగుండేందుకు.. ఆ దేశంతో సత్ సంబంధాల కోసం ప్రపంచ దేశాలన్నీ వీలైనంత జాగ్రత్తగా ఉంటాయి. కిమ్ లాంటి ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారంతా ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండేవాళ్లే. అగ్రరాజ్యంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియంది కాదు. దాని శక్తిసామర్థ్యాలు.. గత చరిత్రను చూసినప్పుడు తాము టార్గెట్ చేసే దేశాలు.. వాటి అధినేతల పరిస్థితుల గురించి అవగాహన ఉండటంతో తొందరపడరు. ఒక మాట అన్నా.. ఒక తొందరపాటు చర్యకు పాల్పడినా.. చర్చలతో మాట్లాడుకునేందుకు మక్కువ ప్రదర్శిస్తారే తప్పించి.. ఎదురుతిరిగి మాట్లాడటం ఉండదు.
ఎక్కడి దాకానో ఎందుకు.. ఆపరేషన్ సిందూర్ ఎపిసోడ్ లో జరిగిందేంటి? ట్రంప్ చెబుతున్నదేంటి? ఆ మాటకు వస్తే భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ తనకు ముఖ్యమన్నట్లుగా ట్రంప్ తీరు భారతీయులకు వేదనకు గురి చేసింది. నమ్మకస్తుడు.. శాంతిని కోరే భారత్ లాంటి దేశం తరఫు కాకుండా.. పాక్ పట్ల తనకున్న మక్కువ ప్రదర్శించటం తెలిసిందే. అంతేనా.. భారత్.. పాక్ రెండు దేశాల్ని ఒకే గాటున కట్టటం చూసిన చాలామంది వేదనకు గురయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారత్ - పాక్ మధ్య యుద్దాన్ని తానే ఆపానని గొప్పలు చెప్పుకోవటం.. అవసరానికి మించిన అతిని ప్రదర్శించిన ట్రంప్ తీరు చాలామంది భారతీయులకే కాదు.. ప్రపంచ దేశాలకు చిరాకు తెప్పించింది.
ఇలాంటి వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఘాటైన కౌంటర్ ఇవ్వాలని.. ట్రంప్ వ్యాఖ్యలకు సమాధానాలు చెప్పాలంటూ ప్రశ్నిస్తూ రాజకీయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మోడీ ఎందుకు సమాధానం చెప్పాలి? ఒక తలతిక్క అధినేత నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు స్పందించటం ద్వారా సాధించేదేంటి? మాటకు మాట అనేందుకు ఎలాంటి మొహమాటం లేని అహంకారి అయిన ట్రంప్ ను ఎలా డీల్ చేయాలో మోడీకి తెలియంది కాదు. అందుకే ఆయన గుంభనంగా ఉన్నారు. తాను చెప్పాల్సిన విషయాన్ని కొన్ని వేదికల మీద చెబుతున్నారు. అమెరికా తీరును ప్రత్యక్షంగా కాకున్నా.. ఆయన టీం మెంబర్ల ద్వారా పరోక్షంగా చురకలు తగిలేలా చేస్తున్నారు.
నిజానికి ట్రంప్ తో మోడీకి ఉన్న అనుబంధాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈపాటికి ట్రంప్ భారత పర్యటనకు రావాల్సి ఉంటుంది. అదే సమయంలో మోడీ సైతం రెండు.మూడుసార్లు కలవాల్సి ఉంటుంది. రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పించి.. తొందరపాటు ప్రదర్శించకపోవటం కనిపిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ట్రంప్ ను డీల్ చేసే పద్దతి మోడీకి బాగా తెలుసు. అందుకే.. ఆపరేషన్ సిందూర్ ఎపిసోడ్ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు తాను సమాధానం ఇవ్వకుండా.. విదేశాంగ మంత్రి జైశంకర్ చేత బదులు ఇప్పిస్తున్నారు. తెంపరి ట్రంప్ తో జగడం పెట్టుకునే పరిస్థితి భారత్ కు లేదు. అలా అని ఊరుకోవటం సాధ్యం కాదు. అందుకే మధ్యే మార్గంగా తాను మాట్లాడకుండా.. తాను చెప్పాలనుకున్న మాటల్ని తన టీంతో చెబుతూ.. తాను సైలెంట్ మోడీలో ట్రంప్ కు సరైన రీతిలో సమాధానం ఇస్తున్నారని చెప్పాలి.
