పీఓకే మాటతో పాక్ కి మోడీ చెక్
ఉగ్రవాదం చర్చలు ఒకేసారి జరగవని స్పష్టం చేశారు. రక్తం నీరు కలసి ప్రవహించలేవని అన్నారు. అణుబాంబులతో భారత్ ఎవరూ కూడా బెదిరించలేరని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 12 May 2025 11:33 PM ISTపాక్ తో మాటలు ఉండాలన్నా మాట్లాడుకోవడాలు ఉండాలన్నా పీఓకేతోనే అని మోడీ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదనే చర్చలు అని ఆయన తేల్చేశారు. మొత్తానికి చూస్తే భారత్ పాక్ ఆయువు పట్టు మీద గురి చూసి కొట్టింది అని అంటున్నారు.
గత పాతిక రోజులుగా దేశంలో చోటు చేసుకున్న అనేక పరిణామాల మీద తొలిసారి తన మనసులో భావాలను జాతిని ఉద్దేశించి నరేంద్ర మోడీ జాతి జనులతో పంచుకున్నారు. దూరదర్శన్ ద్వారా ఆయన అరగంట పాటు ప్రసంగించిన తీరు చూస్తే పాక్ తో దేనికైనా సిద్ధమే అన్నట్లుగానే చెప్పారని అనిపిస్తోంది. ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాక్ కి బుద్ధి చెబుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
అంతే కాదు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం సింధు నదీ జలాల నీటి పంపిణీ ఏక కాలంలో ఉండవని పేర్కొన్నారు. ఉగ్రవాదం వాణిజ్యం కలసి ప్రయాణించలేవని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పాకిస్థాన్ మానుకోవాలని ఆయన సూచించారు.
ఉగ్రవాదం చర్చలు ఒకేసారి జరగవని స్పష్టం చేశారు. రక్తం నీరు కలసి ప్రవహించలేవని అన్నారు. అణుబాంబులతో భారత్ ఎవరూ కూడా బెదిరించలేరని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ పుట్టిల్లు అని గురి చూసి మరీ అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ని నిలబెట్టారు. ఉగ్రవాదులు మతం పేరిట విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశం అంతా కూడా ఒక్కతాటిపై నిలిచిందని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం తన సత్తాను ప్రపంచానికి చాటిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదుల శిబిరాల మీద బలమైన దాడులు నిర్వహించిందని అన్నారు. భారత రక్షణ దళాలు ప్రతిభా పాటవాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించాయని గుర్తు చేశారు. భారత జవాన్ల సామర్థ్యం దేశానికి గర్వకారణమని అన్నారు.
భారత నిఘా వర్గాల సమర్ధత రక్షణ శాఖ శాస్త్ర సాంకేతిక సంపత్తిని కూడా దేశమంతా చూసిందని చెప్పారు. భారత తోబుట్టువుల నుదుటి సింధూరం తుడిచిన ఉగ్రవాదులని కూకటి వేళ్ళతో పేకిలించడం జరిగిందని ప్రధానమంత్రి అన్నారు. పాకిస్థాన్ తనకు తానుగా ఉగ్ర శిబిరాలను ద్వంసం చేయాలని చెప్పారు.
అణుబాంబులతో మనల్ని ఎవరూ కూడా బెదిరించలేరని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వదలడం తప్ప పొరుగుదేశానికి మరో గత్యంతరం లేదని ప్రధానమంత్రి అన్నారు. ఇక మీదట పాకిస్థాన్ తో చర్చలు భారత్ పెట్టిన షరతుల మేరకే సాగుతాయని ఆయన చెప్పారు. మొత్తానికి చూస్తే మోడీ స్పీచ్ పవర్ ఫుల్ గా సాగింది. భారతీయుల చాలా సందేహాలను అది తీర్చింది. అంతే కాదు పాక్ భారత్ మీద మరోసారి ఉగ్ర నీడ ఉంచినా ఏ విధంగా కెలికినా దబిడి దిబిడి అయిపోతుందని కూడా మోడీ పక్కా మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇక తేల్చుకోవాల్సింది పాక్ మాత్రమే అని అంటున్నారు.