మోడీ స్పీచ్... ప్రజల పెదవి విరుపుకు నాలుగు కారణాలు!
ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా జాతినుద్దేశించి మోడీ చెప్పిన మాటలపై ప్రజల్లో ప్రతిస్పందన అంతంతమాత్రంగానే ఉందని.. సగటు భారతీయుడి నుంచి పెదవి విరుపు ప్రతిస్పందనే వస్తుందనే కామెంట్లు తాజాగా వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 13 May 2025 5:00 AMఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా భారత ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పాక్ ను హెచ్చరిస్తూ, ఉగ్రవాదులను భయపెడుతూ, మన సైనికులను అభినందిస్తూ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ నుంచి కాల్పుల విరమణ వరకు సైన్యం చూపించిన ప్రతిభ, తెగువ, సమన్వయం, సంయమనం గురించి ప్రధాని మాట్లాడారు. ఇదే సమయంలో.. భారత మహిళల నుదుటిన సిందూరం చెరిపేస్తే ఏమవుతుందో ఉగ్రవాదులకు చూపించామని అన్నారు. పాకిస్థాన్ ను వణికించేశామని.. వారి మిస్సైళ్లను నిర్వీర్యం చేశామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా.. భారత దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరిస్తూ... సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ దాడులను గుర్తుచేసుకున్నారు. పాక్ తో జరగబోయే చర్చలు భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే సాగుతాయని.. పాక్ అణు బ్లాక్ మెయిలింగ్ ఇక సహించేది లేదని గట్టి హెచ్చరికలు పంపారు.
ఈ స్పీచ్ ముగిసిన అనంతరం.. బీజేపీ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సెలబ్రెటీలు.. ఇది మామూలు స్పీచ్ కాదని, పాక్ కు ఇవి మామూలు హెచ్చరికలు కావని, ఉగ్రవాదులు ఇకపై భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయని స్థాయిలో ఈ ప్రసంగం సాగిందన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపించడం మొదలుపెట్టారు!
మరోవైపు ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయ్యిందని దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాపెయిన్ చేపట్టనుంది బీజేపీ. ఇందులో భాగంగా... మే 13 నుంచి ఈ యాత్రను ప్రారంభించి ప్రధాని మోడీ నాయకత్వ పటిమ గురించి ప్రజలకు వివరించనుంది! ఆ సంగతి అలా ఉంటే... మోడీ స్పీచ్ పై సగటు భారతీయుడి నుంచి మాత్రం పెదవి విరుపు ప్రతిస్పందనే వచ్చిందని అంటున్నారు.
అవును... ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా జాతినుద్దేశించి మోడీ చెప్పిన మాటలపై ప్రజల్లో ప్రతిస్పందన అంతంతమాత్రంగానే ఉందని.. సగటు భారతీయుడి నుంచి పెదవి విరుపు ప్రతిస్పందనే వస్తుందనే కామెంట్లు తాజాగా వినిపిస్తున్నాయి. అయితే... చాలా మంది ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని అంటున్నారు.
కాల్పుల విరమణ - ట్రంప్ ప్రకటన!:
వాస్తవానికి మే 7, 8, 9 తేదీల్లో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో భారత్ పై దాడికి పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆ ప్రయత్నాలను తిప్పికొడుతోంది. మరోపక్క.. భారత సైన్యం పాక్ ని తూట్లు తూట్లుగా చేస్తుంది. ఇస్లామాబాద్ నే టచ్ చేసిందని అంటున్నారు.
ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ అప్ స్కాండ్ అయిపోయాడని.. పాక్ ప్రధాన మంత్రి సేఫ్ హౌస్ కి చేరిపోయారని వార్తలొచ్చాయి! ఈ స్థాయిలో భారత సైన్యం పాక్ ని తూట్లు పొడుస్తుందని కథనాలొచ్చాయి! దీంతో... ఇకపై భారత్ కు పక్కలో బల్లెం సమస్య ఆల్ మోస్ట్ తీరిపోతుందని, ఉగ్రవాదులను పాక్ నుంచి బందీలుగా తెస్తుందని చాలామంది భావించారని అంటున్నరు!
అయితే అవేమీ జరగకుండానే... కాల్పుల విరమణ అంగీకారానికి వచ్చినట్లు ప్రకటించరు. అది కూడా మూడో వ్యక్తి (అమెరికా అధ్యక్షుడు) ముందుగా ప్రకటించడాన్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడని అంటున్నారు.
పహల్గాం దాడి బ్యాచ్ దొరికిందా?:
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రశిబిరాలపై దాడి చేసి ఏకంగా 100 మంది ఉగ్రవాదులను చంపినట్లు సైన్యం ప్రకటించింది. అయితే... పహల్గాంలో 26 మందిని అత్యంత కిరాతకంగా చంపి, డ్రై ఫ్రూట్స్ తింటూ వెళ్ళి, ఎక్కడో హాయిగా ఉన్న ఆ నలుగురు ఉగ్రవాదులను తలచుకుంటేనే, వారి ఫోటోలు కనిపిస్తేనే ఒళ్లు మండిపోతుందన్ని అంటున్నారు.
అలాంటి పరిస్థితుల్లో అసలు వాళ్లు దొరికారా.. వాళ్లను సజీవంగానో, నిర్జీవంగానో పట్టుకుని దేశానికి చూపించే అవకాశం లేదా.. ఆపరేషన్ సిందూర్ లో మరణించిన 100 మంది ఉగ్రవాదుల్లో ఆ నలుగురూ ఉన్నారా.. లేరా? ఉంటే.. గుర్తుపట్టలేనట్లుగా ఉన్నారా? ఈ విషయాలపై సగటు భారతీయుడు రాజీపడే ప్రసక్తి లేదనేది మరో కారణం అని అంటున్నారు!
ఇంతకు మించిన సువర్ణావకాశం ఉంటుందా?:
భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన పాకిస్థాన్ కు భారత్ బలంగా బుద్ది చెప్పడానికి ఇంతకు మించిన సువర్ణావకాశం మరొకటి ఉండదని, మరోసారి రాకపోవచ్చనేది చాలా మంది పరిశీలకుల, మాజీ సైన్యాధికారుల బలమైన అభిప్రాయంగా ఉందని అంటున్నారు. పాక్ ఆర్థికంగా ఇప్పుడు చితికిపోయి ఉంది! సైన్యం వద్ద మందుగుండు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు.
మరోపక్క.. బలుచిస్తాన్ ప్రత్యక దేశ సాధనలో బిజీగా ఉన్న బౌలుచీ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ).. పాక్ సైనికులకు కంటిమీద కునుకులేకుండా.. ఓ పక్క నుంచి నరుక్కుంటూ వస్తుంది! ఈ సమయంలో పాక్ సైన్యం రెండుగా చీలి పనిచేయాల్సిన పరిస్థితి! పైగా పాక్ గగనతల రక్షణ వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందనే విషయం భారత్ కు మే 8వ తేదీనే తెలిసిందని అంటున్నారు!
ఇలాంటి సువర్ణావకాశాన్ని వదులుకుని.. పాక్ డీజీఎంఏ 3:30 కి ఫోన్ చేశాడని, అందుకు 5 గంటలకు కాల్పులు ఆపేస్తున్నామని ప్రకటించడాన్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నారనేది మరో కారణంగా చెబుతున్నారు.
కండిషన్స్ ఏమిటి?:
ఇంత హుటా హుటిన పాకిస్థాన్ తో కాల్పుల విరమణ అంగీకారానికి రావడంపై ప్రజల్లో ఇంత అసంతృప్తి ఉండటానికి మరో కారణం.. ఈ నిర్ణయానికి గల కండిషన్స్! ఇవి చెప్పిన తర్వాత.. సీజ్ ఫైర్ గురించి చెబితే.. ఇప్పుడున్నంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదని అంటున్నారు.
అవేమిటంటే... పీవోకే ను తిరిగి ఇస్తామని పాక్ అంగీకరించింది.. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను.. పాక్ లో దాక్కొన్న ఇండియా మోస్ట్ వాంటెడ్ లను భారత్ కు అప్పగిస్తామని చెప్పింది.. ఆ రెండూ జరిగిన అనంతరం సింధూ నదీ జలాల ఒప్పందంపై చేసిన రద్దును ఎత్తి వేయాలని కోరింది వంటివి చెప్పి ఉంటే.. మోడీ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్లి ఉండేదని అంటున్నారు!
ముందు వాతావారణాన్ని చల్లబరిచేసి.. భవిష్యత్తులో పీఓకే, ఉగ్రవాదుల అప్పగింత గురించి మాత్రమే పాక్ తో చర్చలు ఉంటాయని చెప్పడాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనేది చాలా మంది అభిప్రాయంగా ఉందని అంటున్నారు. పైగా... భవిష్యత్తులో మరో పహల్గాం, మరో పుల్వామా జరగదనే గ్యారెంటీ ట్రంప్ ఇచ్చారా.. లేక, పాకిస్థాన్ ఇచ్చిందా అనేది ప్రజలకు క్లారిటీ ఇవ్వకపోవడం మరొక కారణం అని అంటున్నారు.
భారత్ లో మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే.. అది యుద్ధానికి సంకేతం అని భావించాల్సి ఉంటుందని కేంద్రం చెప్పడాన్ని కూడా ప్రజలు పాజిటివ్ గా తీసుకోలేదని చెబుతున్నారు! అంటే... మరో పహల్గాం జరిగిన తర్వాత మళ్లీ యుద్ధం మొదలుపెడతారా అని నిలదీస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగానే మోడీ స్పీచ్ పై ప్రజలు పెదవి విరుస్తున్నారని అంటున్నారు పరిశీలకులు!