Begin typing your search above and press return to search.

మోదీతో శశిథరూర్.. కాంగ్రెస్ లో ప్రకంపనలు?

ఈ కీలక కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిథరూర్‌ పాల్గొనడం, ఆ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి.

By:  Tupaki Desk   |   2 May 2025 4:35 PM IST
మోదీతో శశిథరూర్.. కాంగ్రెస్ లో ప్రకంపనలు?
X

కేరళలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పలు రాజకీయ సమీకరణాలకు దారితీసింది. ముఖ్యంగా తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక విఝింజమ్‌ అంతర్జాతీయ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ కీలక కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిథరూర్‌ పాల్గొనడం, ఆ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి.

విఝింజమ్‌ పోర్టు ప్రారంభోత్సవం వేదికపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో పాటు శశిథరూర్‌ కూడా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ, శశిథరూర్‌ ఉనికిని ప్రస్తావిస్తూ చేసిన చమత్కార వ్యాఖ్యలు సభికులను, రాజకీయ పరిశీలకులను ఆకట్టుకున్నాయి. ‘‘ఈ రోజు శశిథరూర్‌ ఇక్కడ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్‌ కొందమందికి నిద్ర లేని రాత్రిని మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లలో అక్కడికి వెళ్లిపోయింది’’ అని మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశించినవేనని, థరూర్‌పై వారి అసంతృప్తిని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పోర్టు ప్రారంభోత్సవానికి ముందురోజు కేరళకు చేరుకున్న ప్రధానిని తిరువనంతపురం విమానాశ్రయంలో థరూర్‌ స్వయంగా వెళ్లి స్వాగతించడం కూడా విశేషం. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా థరూర్‌ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేస్తూ, దిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ సమయానికి చేరుకోగలిగానని, తన నియోజకవర్గానికి వచ్చిన ప్రధానికి సాదరంగా స్వాగతం పలికినట్లు పేర్కొన్నారు.

గత కొంతకాలంగా శశిథరూర్‌ కాంగ్రెస్ అధినాయకత్వంతో సఖ్యతగా లేరని, పార్టీలో ఆయన పాత్రపై అసంతృప్తితో ఉన్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన సొంత పార్టీపై బహిరంగంగా విమర్శలు చేయడం, కొందరు కేంద్ర మంత్రులతో సన్నిహితంగా మెలగడం, సెల్ఫీలు దిగడం వంటివి ఆయన పార్టీ మారతారనే ప్రచారానికి ఆజ్యం పోశాయి.

అలాగే, భారత విదేశాంగ విధానంపై ఆయన చేసిన కొన్ని ప్రశంసాత్మక వ్యాఖ్యలు కూడా పార్టీలో కొందరికి నచ్చలేదని టాక్. ఇలాంటి నేపథ్యంలో, ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకోవడం, మోదీ ఆయన ఉనికిని ప్రస్తావించడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

విఝింజమ్‌ పోర్టు ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ ప్రాజెక్ట్ కేరళ ఆర్థిక స్థిరత్వానికి బలం చేకూరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం.. షిప్పింగ్ రంగంలో భారతదేశం యొక్క పాత్రను ఈ పోర్ట్ గణనీయంగా మార్చగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తంమీద, విఝింజమ్‌ పోర్టు ప్రారంభోత్సవం కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాకుండా, శశిథరూర్‌ , కాంగ్రెస్ పార్టీ మధ్య సంబంధాలపై నెలకొన్న సందేహాలను, ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలను మరోసారి తెరపైకి తెచ్చి, రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అంతర్గత సమీకరణాలకు దారితీస్తాయో వేచి చూడాలి.