Begin typing your search above and press return to search.

మోదీ ఇంటికి శరద్ పవార్.. ఆ రెండు బిల్లుల కోసం జోరుగా రాజకీయం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ తోపాటు డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది.

By:  Tupaki Political Desk   |   23 July 2026 7:00 PM IST
మోదీ ఇంటికి శరద్ పవార్.. ఆ రెండు బిల్లుల కోసం జోరుగా రాజకీయం
X

కేంద్రంలో రాజకీయ పరిణామాలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించడమే కాకుండా ధర్నాలు, ఆందోళనలతో కాక రేపుతుండగా, అధికార పక్షం నెమ్మదిగా కీలక బిల్లుల ఆమోదం కోసం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని ఇంటి ముందు విపక్ష నేత రాహుల్ గాంధీ మెరుపు ధర్నాతోపాటు పార్లమెంటు స్తంభించేలా విపక్షాలతో కలిసి పోరాడుతున్నారు. ఇదే సమయంలో విపక్షానికి చెందిన కీలక నేత శరద్ పవార్ బుధవారం ప్రధాని మోదీని ప్రత్యేకంగా కలవడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.

బిల్లుల ఆమోదంపై ప్రత్యేక దృష్టి

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ తోపాటు డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. గత ఏప్రిల్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో 2/3 వంతు మెజార్టీ లేక ఈ బిల్లులు వీగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బిల్లుల ఆమోదానికి రాజ్యసభలో తగిన మెజార్టీ సాధించిన అధికార కూటమి లోక్ సభలోనే ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. 2/3 వంతు మెజార్టీ ఉండాలంటే విపక్షంలోని కొన్ని పార్టీల మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంది. దీంతో ప్రధాని మోదీ సీనియర్ నేత, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ను తన ఇంటికి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ప్రధాని ఆహ్వానంతో ఆయన నివాసానికి తన కుమార్తె, సీనియర్ పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సూలేని వెంటబెట్టుకుని పవార్ వెళ్లారని అంటున్నారు. ఇక తన ఇంటికి వచ్చిన పవార్ కు ప్రధాని స్వయంగా ఆహ్వానం పలకడమే కాకుండా ఇంటి గుమ్మం వరకు ఎదురువెళ్లి సాదరంగా ఆహ్వానించడం కూడా చర్చనీయాంశం అవుతోంది.

శరద్ పవార్ - మోదీ భేటీ వెనుక అసలు కారణం?

ఒకవైపు కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షం నిరసనలు నిర్వహిస్తున్న సమయంలో ఆ శిబిరం నుంచి కీలక నేత ప్రధానితో భేటీ కావడంతో కలకలం రేగింది. శరద్ పవార్ పార్టీకి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉండగా, జనాభాతో సంబంధం లేకుండా 50 శాతం నియోజకవర్గాలను పెంచడంపై ఆ పార్టీ సానుకూలంగా ఉందని అంటున్నారు. దీంతో ప్రధాని మోదీ, ఎన్సీపీ నేత శరద్ పవార్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. నీట్ ఆందోళనల నడుమ జరిగిన ఈ భేటీతో అధికార పక్షం గుట్టుచప్పుడు కాకుండా పావులు కదుపుతుందన్న విషయం అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

డీఎంకే వైఖరిపై ఉత్కంఠ

ఇక పవార్ తరువాత మోదీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ ను కలుస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ తో విభేదిస్తున్న డీఎంకే పార్లమెంటులో మహిళా బిల్లుతోపాటు డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి సహకరించే పరిస్థితి ఉందా? అనే చర్చ జరుగుతోంది. ఈ రెండు బిల్లులను గతంలో కాంగ్రెస్ తో కలిసి వ్యతిరేకించిన డీఎంకే ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉండటంతో వైఖరి మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

కాంగ్రెస్ విధానాలను తాము పాటించాల్సిన అవసరం లేదని చెబుతున్న డీఎంకే బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో తీవ్ర తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం డీఎంకేతో చర్చించే బాధ్యతను ఏపీ సీఎం చంద్రబాబుకు అప్పగించిందని అంటున్నారు. శరద్ పవార్ ప్రధాని ఇంటికి వచ్చిన రోజునే సీఎం చంద్రబాబు కూడా మోదీతో భేటీ అయ్యారు. ఆ సమయంలో రెండు బిల్లుల ఆమోదం విషయంలో చంద్రబాబు చొరవ తీసుకోవాలని పీఎం కోరినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో వీలైనంత వేగంగా 2/3 వంతు మెజార్టీని సమకూర్చుకుని వచ్చేవారం బిల్లులను ఆమోదించుకునేలా కేంద్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.