కేరళలో బీజేపీ వ్యూహం వర్కౌట్ అవుతుందా ?
కేరళలో అధికారంలో ఉన్నది వామపక్ష కూటమి, ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ కూటమి. ఈ రెండు కూటములు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉంటున్నాయి.
By: Satya P | 30 March 2026 9:35 AM ISTకేరళలో అధికారంలో ఉన్నది వామపక్ష కూటమి, ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ కూటమి. ఈ రెండు కూటములు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉంటున్నాయి. మోడీ ఇదే విషయాన్ని కేరళ ఎన్నికల ప్రచారంలో చెబుతూ వారిద్దరూ మిత్రులే అని విమర్శించారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని మోడీ చెప్పుకొచ్చారు. ఒకరి తరువాత మరొకరు అధికారం పంచుకుంటూ కేరళను అభివృద్ధికి దూరం చేశారు అని మోడీ నిందించారు. ఆ ఇద్దరినీ అధికారానికి దూరంగా ఉంచాలని అసలైన ఆల్టర్నేషన్ గా బీజేపీని ఎన్నుకోవాలని ఆయన కోరారు.
భారీ రోడ్ షోతో :
ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ కేరళలో త్రిస్సూర్ లో రోడ్‌షో నిర్వహించారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. రోడ్‌షో సందర్భంగా మోడీ కోసం జనాలు బాగానే వేచి ఉన్నారని ఇది మార్పునకు సంకేతం అని బీజేపీ వర్గాలు అంటున్నాయి. కేరళ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని దానికి కారణం రెండే పార్టీల మధ్య రాష్ట్రం చిక్కుకోవడమే అని అంటున్నారు. మోడీ సైతం తన ఎన్నికల సభలో అదే చెప్పారు.
గల్ఫ్ వార్ నేపధ్యంలో :
ఇక ఇదే సమయంలో పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యం గురించి మోడీ ఈ ఎన్నికల ప్రచారంలో గుర్తు చేశారు. అక్కడ యుద్ధ ప్రాంతంలో భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చిందని మోడీ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభంలో కేరళకు చెందిన ప్రజలు గల్ఫ్ దేశాలలో గణనీయ సంఖ్యలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పశ్చిమ ఆసియా పరిస్థితిని భారత్ నిశితంగా పర్యవేక్షిస్తోందని, దేశంపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి తగిన వ్యూహాలను రూపొందిస్తోందని చెప్పారు.
నిరంతరం చర్చలు :
గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయుల భద్రతను ఎప్పటికపుడు చూస్తున్నామని గల్ఫ్ యుద్ధంతో ప్రభావితమైన దేశాల నాయకులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. అయితే ఈ సున్నితమైన అంశాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న దాదాపు కోటి మంది భారతీయుల భద్రతను పణంగా పెట్టి కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలైన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌లపై కూడా మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అవినీతి వలయంలో ఇరికించాయని వారిపై ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, అభివృద్ధిని సాధించగలది బీజేపీ-ఎన్డీఏ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
వ్యూహాం ఫలించేనా :
ఒక వైపు కేరళలో ఉన్న గల్ఫ్ దేశాల కుటుంబాలను దగ్గర చేసుకుంటూ మరో వైపు అభివృద్ధి మంత్రంతో జనాలను ఆకట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. కేరళలో కాంగ్రెస్ కూటమి వామపక్ష కూటమి పాతుకుపోయాయి. చిత్రమేంటి అంటే ఇండియా కూటమిలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. మరి అక్కడ దోస్తీ ఏంటి ఇక్కడే కుస్తీ ఏంటి అని మోడీ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పాయింట్ జనంలోకి వెళ్తుందా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా కేరళలో బీజేపీ ఏ మేరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది అన్నదే అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
