ఈసారి అమరావతిలో మోడీ రోడ్ షో
అయితే ఈసారి అది ఏపీ రాజధాని అమరావతిలో జరగనుంది మే 2 న ప్రధాని మోడీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 April 2025 6:00 AM ISTఇప్పటికి నాలుగున్నర నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు దానికి మంచి స్పందన లభించింది. ఇపుడు మరో సారి ఆ తరహా రోడ్ షోకి మోడీ సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి అది ఏపీ రాజధాని అమరావతిలో జరగనుంది మే 2 న ప్రధాని మోడీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఆ రోజున మధ్యాహ్యం ఆయన ఢిల్లీ నుంచి బయల్దేరి నేరుగా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడ నుంచి ఆయన అమరావతికి చేరుకుంటారు. అయితే మోడీ బహిరంగ సభకు వచ్చే మార్గంలో ఒక కిలోమీటరు మేర దారిలో రోడ్ షోని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ రోడ్ షోలో మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈసారి కూడా ఈ ముగ్గురూ రోడ్ షోలో పాల్గొంటారు అని అంటున్నారు. ఇక మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలోని రహదారులు, పార్కింగ్ ప్రదేశాలను పురపాలక శాఖా మంత్రి పి నారాయణ పరిశీలించారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠితో కలిసి ప్రధాని సభకు వచ్చే రోడ్లను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రూ. 64 వేల కోట్ల విలువైన పనులకు సంబంధించిన టెండర్లను పిలిచామని చెప్పారు.
ఆ రోజున ప్రధాని సాయంత్రం 4 నుంచి 5 గంటలవరకు బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఆనాటి ప్రధాని సభకు అయిదు లక్షల మంది ప్రజలు హాజరవుతారని భావిస్తున్నామన్నారు. రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణం పనులను సిఆర్డిఎ, ఇతర శాఖల అధికారులతో కలిసి రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు.
ప్రధాని సభ కోసం వచ్చే వారి కోసం వాహనాల కోసం మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంగళగిరి, తాడికొండ, హరిశ్చంద్రపురం, ప్రకాశం బ్యారేజీ, వెస్ట్ బైపాస్ మీదుగా ప్రజలు సభకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
మొత్తం మీద చూసుకుంటే అంగరంగ వైభవంగా ఓడీ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి రాజధాని పునర్ నిర్మాణం విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని చూస్తున్నారు. అన్నీ మంచి శకునములే అన్నట్లుగా అమరావతి కోసం అలా కుదురుతున్నాయి. ఏది ఏమైనా మోడీ రోడ్ షో అమరావతిలో ఈసారి హైలెట్ గా నిలవనుంది అని అంటున్నారు.
