మీడియా ఓ మధ్యవర్తి.. అందుకే మోడీ మాట్లాడరు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియాతో మాట్లాడడం వంటివి గత 12 ఏళ్లలో అత్యంత అరుదనే చెప్పాలి.
By: Garuda Media | 11 July 2026 11:00 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియాతో మాట్లాడడం వంటివి గత 12 ఏళ్లలో అత్యంత అరుదనే చెప్పాలి. కేవలం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజు మాత్రమే ఆయన ముక్తసరిగా మీడియా ముందుకు విపక్షాలకు అభ్యర్థన చేస్తారు. సభను సజావుగాసాగేందుకు సహకరించాలని కోరతారు. అంతకుమించి.. మీడియా అడిగే ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పరు. అయితే.. ఇటీవల ఆయన విదేశాల్లో పర్యటిస్తున్న సందర్భాల్లో ఇవే ప్రశ్నలు అక్కడి జర్నలిస్టులు సంధిస్తున్నారు. వీటికి భారత ప్రభుత్వం భిన్నమైన సమాధానం ఇస్తోంది.
గత నెల కిందట నార్వేలో పర్యటించిన ప్రధానిని అక్కడి మహిళా జర్నలిస్టు ఒకరు.. ``మీ దేశంలో పత్రికా స్వేచ్ఛ అట్టడుగున ఉంది.. దీనికి కారణమేంటి`` అని ప్రశ్నించారు. అయితే.. ప్రధాని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. దీంతో మరింత వెంటబడి మరీ ప్రశ్నించారు. అయితే.. అధికారులు సదరు జర్నలిస్టును అడ్డుకున్నారు. అనంతరం ఆమె సోషల్ మీడియాలోనూ ఇదే ప్రశ్న సంధించారు. ప్రపంచ దేశాల్లో నార్వే పత్రికా స్వేచ్ఛలో ముందున్న విషయం తెలిసిందే. అనంతరం.. భారత ప్రభుత్వం భిన్నమైన సమాధానం ఇచ్చింది. ``చైనా మూలాలు ఉన్న మహిళా జర్నలిస్టు`` అని ఆమెపై ముద్ర వేసి ఊరుకుంది.
ఇక, తాజాగా న్యూజిలాండ్ లో ప్రధాని పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కూడా దాదాపు ఇదే ప్రశ్న ఎదురైంది. ``భారత్‌కు మూ డోసారి ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ.. ఒక్కసారి కూడా మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు.`` అని అక్కడి జర్నలిస్టు ఒకరు భారత దౌత్యాధికారిని ప్రశ్నించారు. దీనికి ఆయన భిన్నమైన సమాధానం చెప్పారు. ``ప్రధాని ఎవరో మధ్య వర్తుల ద్వారా ప్రజలతో మాట్లాడాలని అనుకోరు. ఆయన నేరుగా ప్రజలతోనే సంబంధాలు పెట్టుకుంటారు. అందుకే మన్‌కీ బాత్ వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అయ్యారు. ఇది ప్రధానికి ప్రజలకు మధ్య భావోద్వేగ సంబంధాన్ని బలోపేతం చేసింది.`` అన్నారు.
అంతేకాదు.. దేశంలో మూడుసార్లు ఎన్నికై సుదీర్ఘకాలంగా ప్రధానిపోస్టులో ఉన్న మోడీకి ప్రజలతో మాట్లాడడం అంటేనే ఎంతో ఇష్టం. ఆయన మధ్యవర్తుల(మీడియా) ద్వారా ప్రజలకు ఏదో చెప్పాలని ఆశించరు. అని వ్యాఖ్యానించారు. దేశంలో గ్రామీణ ప్రజలు ఎక్కువని, వారంతా నేరుగా ప్రధాని తమతో మాట్లాడాలనే కోరుకుంటారని చెప్పారు. మీడియాకు దూరంగా ఉండాలని మోడీ అనుకోరని.. కానీ.. ప్రజల కోరిక మేరకు వారితోనే నేరుగా సత్సంబంధాలు పెట్టుకుంటారని సెలవిచ్చారు. ఇదీ.. సంగతి!.
