Begin typing your search above and press return to search.

ఏపీ, లోకేష్ పై మోడీ ప్రత్యేక దృష్టి... ఇదిగో తాజా ఉదా!

ఏపీపై కేంద్రం దృష్టి గత రెండు దఫాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, మూడోసారి అధికారంలోకి వచ్చాక మరోలెక్క అన్నట్లుగా మారిపోయిందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Jun 2025 12:22 PM IST
ఏపీ, లోకేష్ పై మోడీ ప్రత్యేక దృష్టి... ఇదిగో తాజా ఉదా!
X

ఏపీపై కేంద్రం దృష్టి గత రెండు దఫాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, మూడోసారి అధికారంలోకి వచ్చాక మరోలెక్క అన్నట్లుగా మారిపోయిందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీపై మోడీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ప్రత్యేక పథకాలు, ఆర్థిక సహకారాలు వరుసగా అందిస్తున్నారు. ఈ సమయంలో ఏపీ, లోకేష్ లపై మోడీకి ఉన్న ప్రత్యేక దృష్టి విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

అవును... తాజాగా ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని విశాఖలో ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్య అతిథిగా మోడీ పాల్గొనే యోగా డేకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ నెల 21న జరగనున్న ఈ యోగా డేకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయన్న విషయంపై మోడీ ఆరా తీశారట.

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ల గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాలు తిరిగి భారత్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా బృందాల్లోని సభ్యులకు మోడీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఏపీ నుంచి టీడీపీ యువ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సభ్యుడిగా ఉండగా.. ఈ విందుకు హాజరైన ఆయనతో ప్రధాని మోడీ మాట కలిపారట. ఈ సందర్భంగా లోకేష్ గురించి ప్రస్థావించారట.

ఇందులో భాగంగా.. విశాఖలో యోగా డే ఏర్పాట్లు గురించి ఆరా తీసిన మోడీ... ఆ ఏర్పాట్లను మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లుగా తనకు తెలిసిందని చెప్పారట. ఇదే సమయంలో... లోకేష్ అవిశ్రాంతంగా కష్ట పడుతున్నారనే విషయం తనకు తెలిసిందని.. విశాఖలో యోగా డేకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కేలా ఏర్పాట్లు జరుగుతున్నాయనే విషయంపై తనకు సమాచారం వచ్చిందని కూడా మోడీ చెప్పారట.

కాగా... ఈ నెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏర్పాట్లను తాజాగా మంత్రి లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఇతర మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, సంధ్యారాణి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా స్పందించిన మంత్రి లోకేష్... ఈ యోగాంధ్ర కార్యక్రమం ప్రజలందరిదీనని అన్నారు. చరిత్ర సృష్టించనున్న ఈ యోగా వేడుక నిర్వహణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ఆ రోజు సాధించే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోందని తెలిపారు. ప్రధాని మోడీ సహా పలువురు ముఖ్యులు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.