'కాక్రోచ్' పార్లమెంటు మార్చ్ పనిచేసిందా? నీట్ పై ఎట్టకేలకు ప్రధాని స్పందన!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.
By: Tupaki Desk | 21 July 2026 12:48 PM ISTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. పేపర్ లీకేజీ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. యువత భవితతో చెలగాటమాడారని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తేల్చిచెప్పారు. దాదాపు రెండు నెలల తర్వాత నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది. మే నెల 3వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించగా, పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్షను రద్దు చేశారు. గత నెల 21న మళ్లీ పరీక్ష నిర్వహించడం, మూడు రోజుల క్రితమే ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇదే సమయంలో ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహించాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో భారీగా నిరసన ప్రదర్శనలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రధాని తాజాగా పేపర్ లీక్ ఘటనపై స్పందించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకుని మంగళవారం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధాని మోదీ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించారు. పేపర్ లీక్ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించిందని ఆయన గుర్తు చేశారు. ఈ అక్రమాలకు పాల్పడిన ప్రధాన నిందితులతో సహా సుమారు 13 మందిని ఇప్పటికే అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపామని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, ఇందులో భాగంగానే ఎలాంటి ఆలస్యం లేకుండా రీ-ఎగ్జామినేషన్ నిర్వహించామని ప్రధాని వివరించారు.
కఠిన శిక్షలు తప్పవు
తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా లీకులకు తావు లేకుండా 'ఫూల్‌ప్రూఫ్' పరీక్షా విధానాన్ని తీసుకువచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ యువత భద్రత, వారి భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనవని తేల్చిచెప్పారు. ఇక నీట్ పేపర్ లీక్ వంటి సున్నితమైన అంశాలను కేవలం రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవడం సరికాదని ప్రధాని హితవు పలికారు. ఇది దేశంలోని యువత భవిష్యత్తుకు సంబంధించిన జాతీయ సమస్య అని, దీనిపై అధికార, విపక్షాలు అనే తేడా లేకుండా అందరూ నిర్మాణాత్మకంగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై చర్చ జరగాలని, దేశ భవిష్యత్తు కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు.
ఢిల్లీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు, పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతలకు దారితీసిన తరుణంలో ప్రధాని మోదీ నుంచి ఈ స్పందన వెలువడటం గమనార్హం. దోషులకు కఠినతరమైన శిక్షలు విధించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయడానికి ఎవరూ సాహసించకుండా కట్టడి చేస్తామని ప్రభుత్వం తరఫున స్పష్టమైన సంకేతాలు పంపారని ప్రధాని మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రధాని స్పందనపై ఆందోళనకారులు పెదవి విరుస్తున్నారు. నీట్ పేపరు లీకు కారణంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, లక్షల మంది విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపరు లీకు ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ పై ప్రధాని స్పందించకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
