ప్రెస్ మీట్ వద్దు కానీ మన్ కీ బాత్ ఎప్పుడు మోడీ?
తాజా ఉద్రిక్తల వేళ చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు యావత్ భారతం కోరుకునేది ఒక్కటే. అది.. భారత ప్రధానమంత్రి మానసపుత్రిక అయిన మన్ కీ బాత్ కార్యక్రమం.
By: Tupaki Desk | 12 May 2025 12:00 PM ISTతాజా ఉద్రిక్తల వేళ చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు యావత్ భారతం కోరుకునేది ఒక్కటే. అది.. భారత ప్రధానమంత్రి మానసపుత్రిక అయిన మన్ కీ బాత్ కార్యక్రమం. అవును.. ప్రదానమంత్రి హోదాలో ప్రెస్ మీట్లు పెట్టటానికి మోడీకి సుతారం ఇష్టం ఉండదు. తన ఆలోచనల్ని.. భావాల్ని దేశ ప్రజలకు షేర్ చేసుకోవటానికి.. తానేం ఆలోచిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయటానికి మీడియా సమావేశాలకు బదులుగా.. తనకు తానే డిజైన్ చేసుకున్న ప్రోగ్రాం మన్ కీ బాత్.
ఈ కార్యక్రమంలో భాగంగా తాను చెప్పాలనుకున్న బోలెడన్ని అంశాల్ని మోడీ చెబుతుంటారు. దేశ వ్యాప్తంగా దీనికి ఉన్న ఆదరణ గురించి తెలిసిందే. పహల్గాం ఉగ్ర ఘటన.. అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. ఆ తర్వాత చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఎంపిక చేసిన కొందరు తప్పించి.. ప్రధానమంత్రి నేరుగా దేశ ప్రజలతో మాట్లాడింది లేదు. ఇప్పుడున్న కన్ఫ్యూజన్ నేపథ్యంలో ఫుల్ క్లారిటీ కావాలంటే ఒక మన్ కీ బాత్ అవసరం ఉంది.
ఇందులో పాక్ దుశ్చర్యల్ని.. భారత్ ధీరత్వాన్ని.. పాక్ కుట్రలకు ఎలాంటి సమాధానం ఇచ్చిందన్న విషయంతో పాటు.. పాకిస్తాన్.. ఉగ్రవాదులు.. ఆక్రమిత కశ్మీర్ విషయంలో తన ఆలోచనల్ని పంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే.. కుట్ర పూరితంగా పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టే తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతుందని చెప్పాలి. సున్నితమైన అంశాల్ని ప్రస్తావించకున్నా.. అసలేం జరిగింది? ఏం జరుగుతుందన్న వివరణ దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అంతేకాదు.. భారత - పాక్ ఉద్రిక్తతల వేళ.. కాల్పుల విరమణ అంశాన్నిఅమెరికా అధ్యక్షుడు చెప్పిన తర్వాతే భారత్ స్పందించిందన్న అంశంపైనా మోడీ రియాక్టు అవ్వాల్సి ఉంది. ఎందుకంటే.. దాయాది జోరుగా చేసే ఫేక్ ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. వాటన్నింటికి చెక్ పెట్టే మన్ కీ బాత్ ఇప్పుడు దేశ ప్రజలకే కాదు.. ప్రధానమంత్రి మోడీకి కూడా అవసరమే. పాక్ విషయంలోనూ.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అంశంలోనూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాల్లో మోడీ తన ఆలోచనల్ని దేశ ప్రజలతో షేర్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది.
