సరిహద్దుల నుంచే పాక్ హద్దులేమిటో చెప్పనున్న మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ అండ్ కాశ్మీర్ టూర్ పెట్టుకున్నారు. ఈ నెల 6వ తేదీన ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది.
By: Tupaki Desk | 3 Jun 2025 8:52 PM ISTప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ అండ్ కాశ్మీర్ టూర్ పెట్టుకున్నారు. ఈ నెల 6వ తేదీన ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇప్పటికే అనేకసార్లు మోడీ వెళ్ళారు. కానీ ఈసారి టూర్ మాత్రం ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్ 22న జమ్మూలోని పహిల్గాం లో ఉగ్రవాదులు దాడులు చేసి అమాయకులు అయిన 27 మంది పర్యాటకులని పొట్టన పెట్టుకున్నారు. దీంతో ఇది ప్రపంచాన్నే నివ్వెర పరచే అత్యంత కిరాతకంగా నిలిచింది. ప్రపంచమంతా భారత్ కి అండగా ఉంటూ ఉగ్ర ఘాతుకాన్ని ముక్త కంఠంతో ఖండించాయి.
ఇక ఈ ఘటన తరువాత పదిహేను రోజుల తేడాలో మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాయాది దేశం అయిన పాకిస్తాన్ కి బుద్ధి వచ్చేలా ఎయిర్ సర్జికల్స్ చేసి నోరు మూయించింది. అంతే కాదు సిందు నదీ జలాలను సైతం నిలుపు చేసి పాక్ గొంతు ఎండిపోయేలా చేసింది.
ఇక దౌత్యపరంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే పహిల్గాం లో ఉగ్ర దాడి తరువాత హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనేక సార్లు జమ్మూ అండ్ కాశ్మీర్ లో పర్యటించారు. వారు ఉగ్ర దాడి జరిగిన ప్రాంతాన్ని సైతం సందర్శించారు. అక్కడ నుంచే పాక్ కి గట్టి హెచ్చరికలను జారీ చేశారు.
ఇక ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఉగ్ర దాడి జరిగిన 43 రోజుల తరువాత జమ్మూ అండ్ కాశ్మీర్ టూర్ చేస్తున్నారు. ఆయన ఈ సందర్భంగా కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్ లో వందేమాతరం రైలుని పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. నిజానికి ఈ కార్యక్రమం ఏప్రిల్ 19నే జరగాల్సి ఉంది. కానీ అప్పట్లో వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేసుకున్నారు. ఈలోగా ఉగ్రదాడి జరగడంతో ఇప్పటిదాకా కుదరలేదు అని అంటున్నారు.
ఈ కార్యక్రమంతో పాటు చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు, అనేక ఇతర అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుడతారు. అదే విధంగా శ్రీ మాతా వైష్ణో దేవి కుత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకూ భారత్ ప్రత్యేక కాశ్మీర్ ఎడిషన్ ని ప్రారంభిస్తారు.
ఇక ఉగ్రదాడి జరిగిన గడ్డ మీద నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమి మాట్లాడుతారు అన్న చర్చ అంతటా సాగుతోంది. ఇప్పటికే గుజరాత్, బీహార్ యూపీ పర్యటనలలో ప్రధాని మోడీ పాక్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పాక్ విషయంలో తన పోరాటం ఎప్పటికీ ఆగదని ఆపరేషన్ సిందూర్ ని కొనసాగించి తీరుతామని కూడా స్పష్టం చేశారు.
ఇపుడు ఏకంగా కాశ్మీర్ లోనే ప్రధాని పాక్ కి గట్టి హెచ్చరిక జారీ చేస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన సరిహద్దుల నుంచే పాక్ హద్దులేమిటో తెలియచేస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని కాశ్మీర్ పర్యటనకు పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తున్నారు. మొత్తానికి ఈ నెల ఆరున ప్రధాని కాశ్మీర్ టూర్ అయితే అందరిలో ఆసక్తిని పెంచుతోంది.