మోడీ.. 'దత్తపుత్రుడు'.. అనడం ఆపేస్తారా.. ?
''ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దత్తపుత్రుడు జగన్'' -ఈ మాట అన్నది చంద్రబాబో.. మరెవరో కాదు.. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
By: Garuda Media | 4 Aug 2026 11:48 AM IST''ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దత్తపుత్రుడు జగన్'' -ఈ మాట అన్నది చంద్రబాబో.. మరెవరో కాదు.. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. 2023-24 మధ్య కాలంలో రెండు దఫాలుగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీని ప్రధాని మోడీ ప్రత్యేక కోణంలో చూస్తున్నారని.. జగన్.. దత్తపుత్రుడని ఆమె చెప్పుకొచ్చారు. దీనికి ప్రధాన కారణం.. అప్పట్లో రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేకపోవడంతో జగన్ స్వయంగా మద్దతు ప్రకటించారు. ఇది అప్పటి అవసరం. దీంతో జగన్‌ను పరోక్షంగా మచ్చిక చేసుకున్నారు.
మరి ఇప్పుడు మాటేంటి? అనేది ప్రశ్న. ఈ విషయంపై బీజేపీ నేతలు మౌనంగా ఉంటున్నారు. జగన్ ఇప్పటికీ దత్తపుత్రుడే అంటూ.. తాజాగా సీపీఐ రామకృష్ణ చేసిన వ్యాఖ్యల అనంతరం.. మరోసారి దీనిపై చర్చ ప్రారంభమైంది. అంతేకాదు.. ఈ ప్లేస్‌ను ఆక్రమించుకునేందుకు మరో నేత ప్రయత్నిస్తున్నారని కూడా రామకృష్ణ అన్నారు. ఇదిలావుంటే.. మోడీ మనసులో ఏముందన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అదేసమయంలో జగన్ ఏమనుకుంటున్నారన్నదీ తెలియాల్సి ఉంది.
ఇక, ఇటీవల భోగాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ప్రధానిని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా.. తొలిసారి చంద్రబాబు విజన్‌ను, స్వర్ణాంధ్రను మెచ్చుకున్నారు. కానీ, ఇది కూటమి పక్షాలకు సంతృప్తినివ్వలేదు. జగన్‌ను మోడీ పన్నెత్తు మాట అనకపోవడం.. కనీసం ఆయన గురించి ఒక్క విమర్శ కూడా చేయకపోవడం అనేది ఒకింత ఇబ్బందిగానే అనిపించింది. మోడీ కనుక జగన్‌ను విమర్శించి ఉంటే.. అనే మాట టీడీపీలో వినిపిస్తోంది.
మరి ఇలా ఎందుకు జరుగుతోంది అనేది కీలక ప్రశ్న. ప్రస్తుతం జగన్‌కు ఉన్న ఎంపీల సంఖ్య తక్కువ గానే ఉంది. ఆయన అవసరం కూడా కేంద్రంలోని మోడీ సర్కారుకు పెద్దగా లేదు. అయినా.. ఇప్పటికీ ఆయనను దత్తపుత్రుడిగానే చూస్తున్నారా? నిజంగానే ఆ భావనతోనే ఉన్నారా? అనేది తొలుస్తున్న ప్రశ్న. ఇక, జగన్‌పై పన్నెత్తు మాట అనేందుకు కూడా బీజేపీ నాయకులు వెనుకాడుతున్నారు. ఈ పరిణామాలు కూటమిలో చర్చకు దారితీస్తున్నాయి. జగన్ను మోడీ.. `దత్తపుత్రుడు`.. అనడం ఆపేస్తారా? అనేది ఇప్పుడు ప్రశ్న. చూడాలి.. మరి ఏం జరుగుతుందో!!.
