భారత్–ఇజ్రాయెల్ సంబంధాల్లో కొత్త అధ్యాయం: 27 రంగాల్లో చారిత్రాత్మక ఒప్పందాలు
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రపంచ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
By: A.N.Kumar | 26 Feb 2026 10:39 PM ISTమధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రపంచ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ముఖాముఖి భేటీలకే పరిమితం కాకుండా 27 కీలక రంగాలలో కుదిరిన ఒప్పందాలు ఇరుదేశాల మధ్య ఉన్న 'వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరో ఉన్నత శిఖరానికి చేర్చాయి. రక్షణ రంగానికి మాత్రమే పరిమితమైన గత సంబంధాలను కాదని ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం, డిజిటల్ ఎకానమీ వంటి ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల్లోకి ఈ బంధం విస్తరించడం విశేషం.
సాంకేతికత.. సరికొత్త వారధి
ఈ పర్యటనలో ప్రధానంగా ఆకట్టుకున్న అంశం డిజిటల్ విప్లవం. భారత్‌లో సంచలనం సృష్టించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థను ఇజ్రాయెల్‌లో ప్రవేశపెట్టేందుకు మొగ్గు చూపడం, రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సులభతరం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) , సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఇజ్రాయెల్ ప్రపంచానికి గురువు వంటిది. అటువంటి దేశంతో భారత్ చేతులు కలపడం ద్వారా మన స్టార్టప్ ఎకోసిస్టమ్, డిజిటల్ మౌలిక సదుపాయాలకు భారీ ఊతం లభించనుంది.
అన్నదాతకు అండగా..
భారతదేశం లాంటి వ్యవసాయ ఆధారిత దేశానికి ఇజ్రాయెల్ అందించే సహకారం వెలకట్టలేనిది. ఇప్పటికే రాష్ట్రాల్లో ఉన్న 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' సంఖ్యను 100కి పెంచాలని నిర్ణయించడం సామాన్య రైతుకు మేలు చేసే పరిణామం. చుక్క నీటిని కూడా వృధా చేయని ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ మన సాగు పద్ధతులను మార్చబోతోంది. తక్కువ వనరులతో ఎక్కువ దిగుబడి సాధించే మెళకువలు భారతీయ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయి.
ఉగ్రవాదంపై ఉమ్మడి సమరం
ఉగ్రవాద బాధిత దేశాలుగా భారత్, ఇజ్రాయెల్ ఈ విషయంలో ఎప్పుడూ ఒకే మాటపై ఉన్నాయి. తాజా ఒప్పందాల ప్రకారం ఇంటెలిజెన్స్ షేరింగ్ , కౌంటర్ టెర్రరిజం టెక్నాలజీలో పరస్పర సహకారం మరింత పెరగనుంది. ఇది సరిహద్దు భద్రత విషయంలో భారత్‌కు పటిష్టమైన రక్షణ కవచాన్ని అందిస్తుంది.
ఆర్థిక ప్రయోజనాలు.. ఎఫ్.టీ.ఏ దిశగా..
త్వరలో కుదరనున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్.టీ.ఏ) ఇరుదేశాల వాణిజ్య రంగానికి గేమ్ ఛేంజర్ కానుంది. ఈ ఒప్పందం అమలైతే సుంకాల తగ్గింపు ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతుంది. ఐటీ, ఫార్మా, ఆభరణాల రంగాల్లో భారీగా పెట్టుబడులు రావడమే కాకుండా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మొత్తంగా చూస్తే ప్రధాని మోదీ పర్యటన కేవలం ఒక దౌత్య కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశపు 'నేషనల్ ఇంట్రెస్ట్' జాతీయ ప్రయోజనం.. ఇజ్రాయెల్ యొక్క 'టెక్నాలజీ ఎడ్జ్' కలయిక. మధ్యప్రాచ్య రాజకీయ సంక్షోభాల మధ్య భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని చాటుతూనే తన అభివృద్ధికి అవసరమైన భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంది. 27 ఒప్పందాలు కేవలం కాగితాల మీద సంతకాలు కాకుండా క్షేత్రస్థాయిలో అమలైతే రెండు దేశాల ప్రజల జీవితాల్లో పెనుమార్పులు రావడం ఖాయం.
