2 రోజల్లో మారిన సీన్.. స్వయంగా ఇన్విటేషన్ పంపిన కెనడా ప్రధాని
దీనికి కారణం కెనడా ప్రధానమంత్రి మార్కో కార్నీ.. స్వయంగా ప్రధానమంత్రి మోడీని జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలని పేర్కొంటూ ఆహ్వానం పంపటమే.
By: Tupaki Desk | 7 Jun 2025 12:52 PM ISTరెండు రోజుల క్రితం జాతీయ.. అంతర్జాతీయ వార్తా కథనాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ మసకబారుతోందని.. అందుకు తగిన పరిణామాల్ని ప్రస్తావిస్తూ విశ్లేషణలు రాశారు. ఇంతకూ ఆ కథనాల సారాంశం ఏమంటే.. కెనడాలో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు భారత్ కు ఆహ్వానం అందలేదని.. దీనికి మోడీ ఇమేజ్ మసకబారటమే అన్నట్లుగా కథనాలు అల్లారు. ఈ నెల 15 - 17 మధ్య కెనడాలోని కననాస్కిస్ లో నిర్వహించే శిఖరాగ్ర సదస్సులో భారత్ భాగస్వామి కాదు.
కానీ.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలకు చెందిన ఈ శిఖరాగ్ర సదస్సుకు కొన్నిదేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఈ జాబితాలో భారత్ పేరు లేకపోవటాన్ని ప్రస్తావిస్తూ కథనాలు వచ్చాయి. దీనికి తోడు ఇటీవల కాలంలో భారత్ - కెనడా మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో కొత్త ప్రధాని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భారత్ తో సంబంధాలు వెనుకటి స్థాయికి చేరుకోలేదన్న భావన వ్యక్తమైంది.
అయితే.. తాజాగా ఆ సీన్ మొత్తం మారిపోయే పరిణామం చోటు చేసుకుంది. దీనికి కారణం కెనడా ప్రధానమంత్రి మార్కో కార్నీ.. స్వయంగా ప్రధానమంత్రి మోడీని జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలని పేర్కొంటూ ఆహ్వానం పంపటమే. అదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్టు పెట్టారు. దీనికి బదులుగా కెనడా ప్రధాని పంపిన ఆహ్వానానికి స్పందించిన ప్రధాని మోడీ తాను సదస్సుకు హాజరు కానున్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
కెనడా ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీకి అభినందనలు తెలుపుతున్నాను. కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు ఆయనకు థ్యాంక్స్ అంటూ మోడీ పేర్కొంటూ.. ‘‘ సజీవ ప్రజాస్వామ్యాలైన భారత్.. కెనడాల ప్రజల మధ్య పెనువేసుకుపోయిన అనుబంధం ఉంది. పరస్పర గౌరవం.. ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాలుగా భారత్ కెనడాలు పని చేస్తాయి.
కెనడా ప్రధానిని సదస్సులో కలవాలని కోరుకుంటున్నా’ అంటూ మోడీ ప్రకటన ద్వారా.. ఇప్పటివరకు మోడీ వ్యతిరేకుల ప్రచారానికి చెక్ చెప్పినట్లైంది. ఏమైనా తాజా పరిణామం అంతర్జాతీయంగా మోడీ ఇమేజ్ ను పెంచేదిగా చెప్పాలి. శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానాలు పంపటం ఆగినట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. భారత ప్రధానికి కెనడా ప్రధాని స్వయంగా ఇన్విటేషన్ పెంచటం ఆసక్తికర పరిణామంగా చెప్పక తప్పదు.
