Begin typing your search above and press return to search.

అందరికంటే టాప్.. మోడీనే ఫస్ట్!

భారత రాజకీయ చరిత్రలో మరోసారి నరేంద్ర మోదీ తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   25 July 2025 11:00 PM IST
అందరికంటే టాప్.. మోడీనే ఫస్ట్!
X

భారత రాజకీయ చరిత్రలో మరోసారి నరేంద్ర మోదీ తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకున్నారు. 2014 మే 26న ప్రధాని పదవిని స్వీకరించిన నరేంద్ర మోదీ, 2025 జూలై 25 నాటికి 4,078 రోజులు పదవిలో కొనసాగుతూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (4,077 రోజులు) రికార్డును అధిగమించారు. ఈక్రమంలో ఆయన స్వతంత్ర భారతదేశంలో రెండవ అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా చరిత్రకెక్కారు. మోదీకి ముందున్న రికార్డు మాత్రం పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరుకు చెందింది. నెహ్రూ సుమారు 16 సంవత్సరాలు పదవిలో కొనసాగారు.

వరుసగా మూడోసారి ప్రధాని

2014, 2019లో పూర్తిస్థాయి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా మెజారిటీ సాధించలేకపోయినా, ఎన్డీఏ కూటమి సహకారంతో మోదీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండవ నాయకుడిగా మోదీ నిలిచారు.

-గుజరాత్‌ నుంచి దేశానికి నేత

గుజరాత్‌కు చెందిన మోదీ, 2001 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 12 సంవత్సరాలకు పైగా రాష్ట్రపాలనలో అనుభవం కలిగిన మోదీ, 2014లో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రధానిగా మారారు. హిందీ మాట్లాడని రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.

-విజయం, స్థిరత్వంలో మోదీ మాంత్రికత్వం

మోదీ నాయకత్వంలో బీజేపీ 2014, 2019, 2024 లలో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇది నెహ్రూ తరువాత ఎవరూ సాధించని ఘనత. గుజరాత్‌ రాష్ట్ర స్థాయి ఎన్నికలు..దేశవ్యాప్త లోక్‌సభ ఎన్నికలతో కలిపి మొత్తం ఆరు ప్రధాన ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించిన ఏకైక నాయకుడిగా మోదీ నిలిచారు.

-పాలనలో సంస్కరణలు, ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్ఠ

మోదీ పదవీ కాలంలో మౌలిక సదుపాయాల విస్తరణ, ఆర్థిక సంస్కరణలు, డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌, ఉజ్వల యోజన, జనధన్‌, అట్మానిర్భర్‌ భారత్‌ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలయ్యాయి. అంతర్జాతీయంగా కూడా భారతదేశం ప్రతిష్ఠను పెంచేలా మోదీ చురుకైన విదేశాంగ విధానం చేపట్టారు.

నరేంద్ర మోదీ నాయకత్వం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలుస్తోంది. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన నేతగా, ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న మోదీ ఇప్పుడు దేశ చరిత్రలో రెండవ దీర్ఘకాలిక ప్రధానిగా నిలవడం గర్వకారణం. తదుపరి కాలంలో ఆయన నాయకత్వం భారతదేశ అభివృద్ధి దిశగా ఎటువంటి మలుపు తీసుకెళ్తుందో వేచి చూడాల్సిందే.