లోక్ సభ సీట్ల పెంపుపై మోడీ సర్కారు కొత్త ఫార్ములా!
దేశ వ్యాప్తంగా లోక్ సభ నియోజకవర్గాల పెంపు విషయంలో ఇప్పటికే బోలెడంత చర్చ జరిగింది.
By: Tupaki Desk | 22 Jun 2025 9:00 PM ISTదేశ వ్యాప్తంగా లోక్ సభ నియోజకవర్గాల పెంపు విషయంలో ఇప్పటికే బోలెడంత చర్చ జరిగింది. ఈ సందర్భంగా జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగితే పలు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందున్న వాదనలు బలంగా వినిపించాయి. ఇలాంటి వేళ.. లోక్ సభ సీట్ల పెంపు అంశంపై కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు చర్చలు జరిగిన దానికి భిన్నంగా.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు పెరిగేందుకు వీలుగా ఒక ఫార్ములాను మోడీ సర్కారు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
దీని ప్రకారం రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా కాకుండా.. రాష్ట్రాల వారీగా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లకు 20 శాతం నియోజకవర్గాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ లెక్కన ఉమ్మడి ఏపీలో మొత్తం 42 స్థానాలు ఉండేవి. అంటే.. 8 స్థానాలు పెరగనున్నాయన్న మాట. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీ పరిధిలో 25 స్థానాలు ఉండగా.. తెలంగాణలో 17 స్థానాలు ఉండటం తెలిసిందే. అంటే.. 5 స్థానాలు ఏపీలో.. 3 స్థానాలు తెలంగాణలో పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది.
జనగణన ఆధారంగా లోక్ సభ సీట్లు పెంచితే కొత్త ఆందోళనలు తెర మీదకు రావటం ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే.. 1971 జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు దేశ జనాభా 55 కోట్లు మాత్రమే. ఇప్పుడు అది కాస్తా 145 కోట్లకు చేరుకుంది. నియోజకవర్గాల పెంపు వేళ.. దక్షిణాధి రాష్టరాలకు నష్టం వాటిల్లకుండా నియోజకవర్గాల సంఖ్య పెంచటం మంచిదని చెబుతున్నారు.
అయితే.. ఇప్పటివరకు వినిపిస్తున్న వాదన ప్రకారం దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన జనాభా పెరిగినట్లుగా వినిపించే వాదనలో సాక్ష్యాలు లేవని.. జనగణన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వసతుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. లోక్ సభ స్థానాల పెంపు అంశానికి సంబంధించి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(జులై 21 నుంచి ఆగస్టు 11) సీట్ల పెంపు బిల్లును ప్రవేశ పెడతారని విశ్వసనీయ వర్గాల భోగట్టా.
2029లో దేశ వ్యాప్తంగా లోక్ సభకు.. అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టేందుకు వీలుగా కేంద్రం తయారవుతుందని చెబుతున్నారు. పహల్ గామ్ లో ఉగ్రదాడి..ఆపరేషన్ సిందూర్.. పాక్ తో ఉద్రిక్తతలతో యుద్ధాన్ని మొదలుపెట్టి కేవలం నాలుగు రోజుల్లోనే ముగించటం లాంటి అంశాలపై అధికారపక్షాన్ని విపక్షాలు విరుచుకుపడాలని భావిస్తున్న వేళ.. అందరి చూపు కొత్త బిల్లు మీద పడేందుకు వీలుగా సీట్ల పెంపు అంశాన్ని తెర మీదకు తెస్తున్నట్లు చెబుతున్నారు.
