Begin typing your search above and press return to search.

భారత రక్షణ రంగంలో చారిత్రక అడుగు: 'చికెన్‌ నెక్'లో భూగర్భ రైళ్లు!

ఈ భూగర్భ మార్గం కేవలం సామాన్య ప్రయాణికుల కోసం మాత్రమే కాదు.. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనుంది.

By:  A.N.Kumar   |   4 Feb 2026 10:43 PM IST
భారత రక్షణ రంగంలో చారిత్రక అడుగు: చికెన్‌ నెక్లో భూగర్భ రైళ్లు!
X

భారత సరిహద్దు భద్రతలో అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ప్రాంతం ‘సిలిగుడి కారిడార్’. దీనినే ప్రాచుర్యంలో ‘చికెన్ నెక్’ అని పిలుస్తారు. ఈ సున్నితమైన ప్రాంతాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని టిన్ మిలే హట్ నుంచి రంగాపానీ వరకు భూమికి సుమారు 20 నుంచి 24 మీటర్ల లోతులో అండర్‌గ్రౌండ్ రైల్వే లైన్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

ఎందుకీ ప్రాజెక్టు? దీని ప్రాధాన్యత ఏమిటి?

సిలిగుడి కారిడార్ కేవలం 20–22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక సన్నని భూభాగం. ఇది భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలతో అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం కలిపే ఏకైక మార్గం. యుద్ధం లేదా సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు శత్రు దేశాలు మొదట ఈ 'చికెన్ నెక్' మార్గాన్ని కత్తిరించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయాలని చూస్తాయి. భూమి ఉపరితలంపై ఉన్న రైల్వే ట్రాక్‌లు వైమానిక దాడులకు లేదా బాంబు దాడులకు గురయ్యే అవకాశం ఉంది. కానీ, 20 మీటర్ల లోతులో నిర్మించే ఈ టన్నెల్స్ శత్రువుల కంటికి చిక్కవు, దాడుల నుంచి సురక్షితంగా ఉంటాయి.

సైనిక అవసరాలకు వెన్నుముక

ఈ భూగర్భ మార్గం కేవలం సామాన్య ప్రయాణికుల కోసం మాత్రమే కాదు.. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. అత్యవసర సమయాల్లో సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను, భారీ ఆయుధ సామాగ్రిని సరిహద్దులకు వేగంగా తరలించడానికి ఇది వీలు కల్పిస్తుంది. శత్రువుల ఉపగ్రహాలు లేదా నిఘా కెమెరాలు ఈ రైళ్ల కదలికలను గుర్తించలేవు. పైగా, ఎంతటి భారీ వైమానిక దాడులనైనా తట్టుకునేలా ఈ టన్నెల్‌లను డిజైన్ చేయనున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఈ భూగర్భ మార్గం ద్వారా రవాణా నిరంతరాయంగా కొనసాగుతుంది.

ఈశాన్య రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి బాటలు

బంగ్లాదేశ్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఈ రైల్వే నెట్‌వర్క్ వల్ల వాణిజ్య రవాణా సులభతరం కానుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పండే పంటలు, ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా చేరుతాయి. ఇది ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను మార్చివేసే 'గేమ్ ఛేంజర్'గా నిలుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. "చికెన్ నెక్ ప్రాంతంలో భూగర్భ రైళ్ల నిర్మాణం భారతదేశ సార్వభౌమాధికారాన్ని చాటిచెప్పడమే కాకుండా శత్రువులకు గట్టి హెచ్చరిక కూడా అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఈశాన్య భారతాన్ని దేశంతో మరింత బలంగా అనుసంధానించడమే కాకుండా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి భారత సైన్యాన్ని సిద్ధం చేస్తోంది.