Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ‘4’ పేర్లను పక్కన పెట్టి శశిథరూర్ ఎంపిక

దాయాదిపై దౌత్య యుద్ధానికి సిద్ధమవుతున్న మోడీ సర్కారు.. అందుకు తగ్గట్లు అన్ని పార్టీలకు చెందిన పలువురి నేతలతో కలిసి అఖిలపక్షం నేతలతో పాటు.. ఏడు టీంలను ఎంపిక చేసింది.

By:  Tupaki Desk   |   18 May 2025 10:54 AM IST
కాంగ్రెస్ ‘4’ పేర్లను పక్కన పెట్టి శశిథరూర్ ఎంపిక
X

దాయాదిపై దౌత్య యుద్ధానికి సిద్ధమవుతున్న మోడీ సర్కారు.. అందుకు తగ్గట్లు అన్ని పార్టీలకు చెందిన పలువురి నేతలతో కలిసి అఖిలపక్షం నేతలతో పాటు.. ఏడు టీంలను ఎంపిక చేసింది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ.. హింసకు తెర తీస్తున్న పాక్ తీరును ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు.. ఉగ్రవాదంపై భారత్ తీరును వివరించేందుకు ఈ ఏడు టీంలు పని చేయనున్నాయి.

ఈ అఖిలపక్షనేతల ఎంపిక విషయంలో కేంద్రం వ్యవహరించిన వైఖరి ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు పేర్లతో ఒక జాబితాను ఇవ్వగా.. కేంద్రం ఆ నలుగురిని పక్కన పెట్టేసి.. పార్టీకి చెందిన సీనియర్ నేత శశి థరూర్ ను ఎంపిక చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది. అంతేకాదు.. సదరు శశిథరూర్ ఏడు టీంలలో ఒక టీంకు నాయకత్వం వహిస్తారని వెల్లడైంది.

తాజా పరిణామం కాంగ్రెస్ పార్టీకి.. శశిథరూర్ కు మధ్య దూరాన్ని పెంచేలా చేస్తుందని చెప్పక తప్పదు. బీజేపీ పట్ల శశిథరూర్ సానుకూలతను వ్యక్తం చేయటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. భారత్ తరఫు విదేశీ వేదికలపై వాణిని వినిపించేందుకు ఎంపిక చేసిన ఏడు టీంలకు నాయకత్వం వహించే నేతల్లో తాము ఎంపిక చేసిన నేతల పేర్లు లేకపోవటాన్ని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కం మీడియా ఇన్ ఛార్జి జైరామ్ రమేశ్ స్పందిస్తూ.. తాము ప్రతిపాదించని వ్యక్తిని ఎంపిక చేయటం ఏమిటి? ప్రశ్నించారు.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజు తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. రాహుల్ గాంధీతో మాట్లాడినట్లు చెప్పారు. విదేశాలకు పంపే ప్రతినిధి బ్రందంలో నలుగురు పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఆ నలుగురు ఎవరంటే..

1. ఆనంద్ శర్మీ

2. గౌరవ్ గొగోయ్

3. సయ్యద్ నజీర్ హుస్సేన్

4. అమరీందర్ సింగ్ రాజా వారింగ్

ఈ నలుగురు పేర్లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసి పంపగా.. అనూహ్యంగా ఈ నలుగురికి బదులుగా శశిథరూర్ ను ఎంపకి చేయటమే కాదు.. ఒక టీంకు నాయకత్వం వహించేలా ఎంపిక చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాక్ తో కాల్పుల విరమణ వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోవటాన్ని పాలక బీజేపీని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ నిర్ణయాన్ని తప్పు పట్టాయి. అనూహ్యంగా శశిథరూర్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తూ.. మోడీ సర్కారును వెనకేసుకొచ్చారు.

అయితే.. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత స్థాయిలో చేసినవిగా ఆయన స్పష్టం చేస్తున్నారు. అఖిలపక్ష టీంకు నాయకత్వం వహించే ఛాన్సు కేంద్రం తనకు కల్పించటంగొప్ప గౌరవంగా భావిస్తున్నాని.. తన సేవలు అవసరమని కేంద్రం భావిస్తే అందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం పరిరక్షణ కోసం తన వంతు సేవల్ని కచ్ఛితంగా చేస్తానని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు థరూర్ ను కాంగ్రెస్ కు దూరం చేసేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.