పవన్ కు కాఫ్లెట్.. ప్రధాని మోడీ సందేశం ఇదేనా?
ఏపీ రాజధాని అమరావతిని పున: ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రావటం.. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టటం.. బహిరంగ సభలో మాట్లాడటం తెలిసిందే.
By: Tupaki Desk | 3 May 2025 5:13 AMఏపీ రాజధాని అమరావతిని పున: ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రావటం.. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టటం.. బహిరంగ సభలో మాట్లాడటం తెలిసిందే. ఈ వేదిక మీదకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావటానికి ముందు.. వచ్చిన తర్వాత.. వేదిక మీద నుంచి నిష్క్రమించే సమయంలోనూ ఆసక్తికర సన్నివేశాలకు కొదవ లేదు. అదే కదా మోడీ మేజిక్ అంటే. అన్నింటిలోనూ అందరిని విపరీతంగా ఆకర్షించటమే కాదు.. ఆ తర్వాత కూడా లోతైన చర్చకు తెర తీసిన ఉదంతం మాత్రం ఒక్కటే ఒక్కటి ఉంది.
జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలవటం.. ఆ విషయాన్ని పవన్ మొదట గమనించలేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగజేసుకొని పవన్ ను రమ్మంటున్నారని చేతితో సైగ చేశారు.ఏదో ముఖ్యమైన విషయం చెప్పటానికి పిలిచారని భావించిన పవన్ స్పందించి పరుగున ఆయన వద్దకు చేరుకోవటం.. ఆయన తన చేతిలో ఉన్న చాక్లెట్ లాంటిది ఇచ్చారు. దీంతో ఆయన ఆశ్చర్య పోయి.. ఆ వెంటనే ఆనందానికి గురి కావటం కనిపించింది. ఇంతకూ పవన్ కల్యాణ్ చేతికి ప్రధాని మోడీ ఇచ్చింది కాఫ్లెట్. హిమాలయ కంపెనీకి చెందినది. పవన్ ను అంత కేరింగ్ గా చూసుకున్న మోడీ తీరుకు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఎక్స్ ప్రెషన్ అందరిని ఆకట్టుకుంది.
ఈ మొత్తం ఎపిసోడ్ కు ముందు ఒక ఘటన జరిగింది. అదేమంటే.. పవన్ తన స్పీచ్ ఇస్తున్న వేళలో పవన్ మూడుసార్లు దగ్గారు. గొంతు ఎండిపోవటం.. గొంతు ఇబ్బందిగా ఉందన్న విషయాన్ని గుర్తించిన ప్రధాని మోడీ.. పవన్ ను పిలిచి మరీ కాఫ్లెట్ ఇవ్వటం ద్వారా.. జనసేనాని విషయంలో ప్రధాని మోడీ ఎంత కేరింగ్ ఉంటారో మరోసారి అర్థమవుతుంది. తాజా ఉదంతంతో మిగిలిన నేతలకు భిన్నంగా పవన్ తనకు స్పెషల్ అన్న విషయాన్ని ప్రధాని చేతలతో చెప్పేశారని చెప్పాలి.
ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షాలకు కొదవ లేదు. జనసేన అధినేత పవన్ విషయంలో ప్రధాని మోడీ ప్రదర్శించే అప్యాయత.. మరే ఇతర పార్టీ అధినేత విషయంలోనూ కనిపించదని చెబుతారు. చివరకు సొంత పార్టీకి చెందిన నేతలతోనూ ఆయన ఈ తరహా ధోరణిని ప్రదర్శించరని చెబుతారు. మిగిలిన అధినేతలకు పవన్ కు వ్యత్యాసం ఉందన్న విషయంతో పాటు.. అతను తన మనసుకు ఎంత దగ్గరన్న విషయాన్ని ప్రధాని దాచుకునే ప్రయత్నం చేయరు. మొత్తంగా చూస్తే.. పవన్ తన ఇంట్లో వ్యక్తిగా భావిస్తారన్న భావన కలిగేలా కాఫ్లెట్ ఇచ్చిన ఉదంతం స్పష్టం చేసిందని చెబుతున్నారు.