Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు దౌత్య వైఫల్యం? జీ7 నుంచి భారత్ కు రాని ఆహ్వానం

ఇలాంటి వేళలోనే.. మోడీ సర్కారు దౌత్య సంబంధాల వైఫల్య పరంపరలో మరో ఉదంతం తెర మీదకు వచ్చింది.

By:  Tupaki Desk   |   4 Jun 2025 9:42 AM IST
మోడీ సర్కారు దౌత్య వైఫల్యం? జీ7 నుంచి భారత్ కు రాని ఆహ్వానం
X

రెండు టర్మ్ లను విజయవంతంగా పూర్తి చేసి.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టిన ప్రధానమంత్రి మోడీ.. తన హయాంలో విదేశాంగ విధానంలో పెను మార్పులు తీసుకొచ్చారని.. ప్రపంచ దేశాల్లో భారత బ్రాండ్ ఇమేజ్ ను పెంచారన్న వాదన ఒక వర్గం బలంగా వినిపిస్తుంటే.. మరోవైపు గతంలో ఎప్పుడూ లేనంతగా భారత్ తన సరిహద్దు దేశాలతో దౌత్య సంబంధాలు కనిష్ఠ స్థాయికి దిగజారినట్లుగా మరికొందరు వాదనలు వినిపించటం తెలిసిందే.

ఆపరేషన్ సిందూర్ ఉదంతంలో స్వదేశంలో భారీ మద్దతును కూడగట్టుకున్న మోడీ సర్కారు.. అందుకు భిన్నంగా ప్రపంచ దేశాల ముందు మాత్రం భారత్ పట్ల సానుకూలత వ్యక్తమయ్యేలా చేసుకోవటంలో ఫెయిల్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే విపక్షాలతో కూడిన ఏడు టీంలను పలు దేశాలకు పంపి.. ఆపరేషన్ సిందూర్ కు దారి తీసిన పరిస్థితులను వివరించినట్లుగా చెబుతారు. ఇలాంటి వేళలోనే.. మోడీ సర్కారు దౌత్య సంబంధాల వైఫల్య పరంపరలో మరో ఉదంతం తెర మీదకు వచ్చింది.

కెనడాలోని అల్బెర్టాలో ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు జీ7 సదస్సు జరగనుంది. ఇందులో అమెరికా.. ఫ్రాన్స్.. బ్రిటన్.. జపాన్.. ఇటలీ.. కెనడా, జర్మనీ దేశాలు సదస్సులో పాల్గొటాయి. వీరితో పాటు బ్రెజిల్.. మెక్సికో.. దక్షిణాఫ్రికా.. ఉక్రెయిన్.. ఆస్ట్రేలియా దేశాలకు ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించిన ఆహ్వానం అందింది. కానీ.. భారత్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. గడిచిన ఆరేళ్లలో ఈ సదస్సుకు తొలిసారి ప్రధాని మోడీ దూరంగా ఉంటారన్న మాట వినిపిస్తోంది.

దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. భారత్ - పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేయటానికి అమెరికాను అనుమతించిన తర్వాత ఇది మరో దౌత్యపరమైన భంగపాటుగా పేర్కొంటున్నారు. త్వరలో జరిగే జీ7 సదస్సులో పశ్చిమాసియాలో నెలకొన్ని పరిస్థితులు.. రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న దీర్ఘకాల యుద్ధంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించే వీలుంది.

నిజానికి జీ7 దేశాల్లో భారత్ సభ్యత్వ దేశం కాదు. ఈ సదస్సును ఏ దేశమైతే నిర్వహిస్తుంటుందో.. ఆ దేశం ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి హాజరయ్యేవారు. గత ఏడాది ఇటలీ వేదికగా జరిగిన సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కావటం తెలిసిందే. ఈసారి కెనడాలో సదస్సు జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనికి ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం లేదంటున్నారు.

ఇప్పటివరకు ఈ సదస్సుకు హాజరు కావాలంటూ మోడీకి ఆహ్వానం అందలేదని.. ఒఖవేళ ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చినా.. భారత్ - కెనడా మధ్య ఉన్న పరిస్థితల నేపథ్యంలో మోడీ అక్కడకు వెళ్లకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. 2014 ముందు జీ8గా ఉండేదని.. అప్పటి ప్రధాని మన్మోహన్ కు అప్పట్లో ఆహ్వానం వచ్చేదని కాంగ్రెస్ చెబుతోంది. 2014 తర్వాత ఆ సంప్రదాయం కొనసాగినా.. ఆరేళ్లలో తొలిసారి మన ప్రధానికి ఆహ్వానం అందకపోవటం.. దౌత్యపరంగా భంగపాటుగా పేర్కొంటున్నారు.