Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ విదేశీ పర్యటనల లెక్కే వేరప్పా!

సాధారణంగా దేశ ప్రధానిగా ఉన్న వారు విదేశీ పర్యటనలు చేస్తుంటారు. అదేమీ తప్పు కూడా కాదు.

By:  Tupaki Desk   |   20 July 2025 10:31 AM IST
ప్రధాని మోడీ విదేశీ పర్యటనల లెక్కే వేరప్పా!
X

సాధారణంగా దేశ ప్రధానిగా ఉన్న వారు విదేశీ పర్యటనలు చేస్తుంటారు. అదేమీ తప్పు కూడా కాదు. కానీ.. అదే పనిగా విదేశీ పర్యటనలు చేసే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ దేశ చరిత్రలో నిలుస్తారు. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన గతాన్ని చూస్తే.. అప్పుడప్పుడు అదే పనిగా విదేశీ పర్యటనల్ని చేస్తుండటం కనిపిస్తుంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన 90 విదేశీ పర్యటనలు చేశారు. మొత్తంగా 78 దేశాల్ని పర్యటించారు.

భారత దేశ చరిత్రలో అత్యధిక దేశాల్లో పర్యటించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నిలుస్తారు. అత్యధికంగా అమెరికాను ఈ పదకొండేళ్ల సమయంలో పదిసార్లు పర్యటించటం విశేషం. ఆ తర్వాతి స్థానంలో ఫ్రాన్స్ (8సార్లు) వెళ్లారు. ఇప్పటివరకు 7సార్లు జపాన్.. రష్యా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను సందర్శించారు. జర్మనీని ఆరుసార్లు.. చైనా.. నేపాల్.. సింగపూర్ దేశాల్ని ఐదుసార్లు.. బ్రెజిల్.. శ్రీలంక దేశాల్ని నాలుగుసార్లు పర్యటించారు.

భూటాన్.. ఇండోనేషియా.. సౌదీ.. దక్షిణాఫ్రికా..థాయిలాండ్.. యూకే.. ఉజ్జెకిస్తాన్ దేశాల్ని మూడుసార్లు పర్యటించగా.. ఆఫ్ఘనిస్తాన్ , అర్జెంటీనా , ఆస్ట్రేలియా , బంగ్లాదేశ్ , కెనడా , ఇటలీ , కజకిస్తాన్ , లావోస్ , కిర్గిజ్స్తాన్ , మలేషియా , మాల్దీవులు , మారిషస్ , మయన్మార్ , ఖతార్ , దక్షిణ కొరియా , స్విట్జర్లాండ్ దేశాల్ని రెండుసార్లు చొప్పున పర్యటించారు. ఇవి కాకుండా మరో 44 దేశాల్ని ఒక్కసారి చొప్పున పర్యటించిన రికార్డు మోడీ సొంతం.

అంతెందుకు ఈ నెల 2 నుంచి 9 వరకు ఐదు (ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా) దేశాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. పదకొండేళ్లు ప్రధానిగా ఉన్న మోడీ.. తాను చేసిన సుదీర్ఘ విదేశీ పర్యటనల్లో ఇదొకటిగా నిలిచింది. ఈ టూర్ లో ఆయన రెండు ఖండాల్ని సందర్శించారు. ప్రధాని హోదాలో మోడీ ఒకే పర్యటనలో ఐదు దేశాల్ని పర్యటించిన రెండో సందర్భంగా ఈ టూర్ ను చెప్పాలి. 2015 జులైలోనూ ఎనిమిది రోజుల్లో ఆరు దేశాల్లో పర్యటించిన రికార్డు ఉంది.

ఈ జులైలోనూ ఆయన 8 రోజుల ఫారిన్ టూర్ ముగించుకొని వచ్చిన 2 వారాల్లోనే మరోసారి 3 రోజుల పాటు (జులై 23 - జులై 26) యూకే.. మాల్దీవుల పర్యటనకు మోడీ వెళ్లేందుకు వీలుగా షెడ్యూల్ సిద్దమైంది. స్వల్ప వ్యవధిలోనే బ్యాక్ టు బ్యాక్ ఫారిన్ టూర్లు వేస్తున్నప్రధానిగా మోడీనే కనిపిస్తారు. ఆసక్తికరమైన మరో అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఈ నెలాఖరులో యూకే.. మాల్దీవులకు వెళ్లి వచ్చిన కొద్ది రోజులకే జపాన్.. చైనా.. మలేషియా..సౌతాఫ్రికా.. నార్వే దేశాలకు సంబందించిన ఫారిన్ టూర్లు ఇప్పటికే షెడ్యూల్ అయి ఉన్నాయి. ఏమైనా.. ఇంత భారీగా విదేశీ పర్యటనలు చేసిన దేశ ప్రధాని మోడీ రికార్డును మాత్రం సమీప భవిష్యత్తులో బ్రేక్ చేయటం సాధ్యం కాదనే చెప్పాలి.