జనాభాకు-నియోజకవర్గాలకు లింకు లేదు: మోడీ
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 5 April 2026 8:45 AM ISTదేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే 2029 పార్లమెంటు ఎన్నికల సమయానికి ఈ పునర్విభజన ఖాయమని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు చెబుతోంది. ఇదేసమయంలో మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని.. పేర్కొంటోంది. ఈ క్రమంలోనే ఈ నెల 16 నుంచి మరో మూడు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను జరపనున్నారు. దీనికి సంబంధించి ప్రకటన కూడా జారీ చేశారు.అంతేకాదు.. ఆ మూడు రోజుల పాటు.. ఎలాంటి ప్రశ్నోత్తరాలు.. ప్రైవేటు బిల్లులు వంటివి కూడా తీసుకునేది లేదని ఉభయ సభలు కూడా ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటకల్లో పార్లమెంటు సీట్లను కుదించేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోందన్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇవి కేవలం రాజకీయ విమర్శలేనని పేర్కొన్నారు. దీనికి నియోజకవర్గాల పెంపునకు సంబంధం లేదన్నారు. అంతేకాదు.. దక్షిణాదిలో జనాభా పెంపుదలకు.. నియోజకవర్గాల పునర్విభజనకు కూడా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గాల పునర్విభజనే ఉంటుందని.. జనాభా ప్రాతిపదికన ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని చెప్పారు.
వాస్తవానికి పార్లమెంటు లేదా.. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడూ.. జనాభా సంఖ్యను ఆధారంగా చేసుకునే ఉంటుంది. ఈ దఫా కూడా జనగణన అయిన తర్వాతే నియోజకవర్గాల విభజన ఉంటుందని ఇటీవల పార్లమెంటులో హోం శాఖ మంత్రి అమిత్‌షా సైతం ప్రకటించారు. కానీ.. ఆ వెంటనే ఆయన కూడా.. ఇది జనాభాకు.. నియోజకవర్గాలకు సంబంధించిన అంశం కాదన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు , జనాభాకు సంబంధం లేకుండా చేస్తున్నామని చెప్పారు. తాజాగా మోడీ సైతం ఇదే చెప్పడంతో ఈ వ్యవహారానికి సమాధానం లభించినట్టు అయింది.
