Begin typing your search above and press return to search.

ట్రంప్ తో డిన్నర్ కు నో చెప్పా.. ఒడిశా ప్రజలతో మోడీ

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం ఒడిశాలో బీజేపీ సర్కారు కొలువు తీరిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Jun 2025 9:33 AM IST
ట్రంప్ తో డిన్నర్ కు నో చెప్పా.. ఒడిశా ప్రజలతో మోడీ
X

చెప్పాల్సిన విషయాన్ని చెప్పే విధంగా చెప్పాలి. నిజం ప్రపంచానికి తెలియాలి. తన చర్యను గొప్పగా తాను చెప్పుకోవటం కాదు. ప్రజలు చెప్పుకోవాలన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం ఒడిశాలో బీజేపీ సర్కారు కొలువు తీరిన సంగతి తెలిసిందే. అక్కడ కమలనాథులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా ఆ రాష్ట్రంలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా అనూహ్య అంశాన్ని ప్రస్తావించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజా జీ7 సదస్సులో భాగంగా కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు వాషింగ్టన్ కు రావాలని ట్రంప్ ఆహ్వానించారని..డిన్నర్ ఇన్విటేషన్ ఇచ్చారన్నారు. అయితే.. మహాప్రభు జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లే అవసరం ఉండటంతో తాను ట్రంప్ ఇన్విటేషన్ కు నో చెప్పి మరీ ఒడిశా వచ్చినట్లుగా చెప్పుకున్నారు.

‘కెనడా పర్యటనలో ఉన్నప్పుడు వాషింగ్టన్ మీదుగా రావాలని ట్రంప్ ఆహ్వానించారు. కలిసి డిన్నర్ చేద్దామన్నారు. మాట్లాడుకుందామని కూడా చెప్పారు. కానీ.. అంతకంటే ఎక్కువగా ఒడిశా జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పా’ అంటూ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. అగ్రరాజ్యాధినేత ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన ఏకైనా భారత ప్రధానిగా సోషల్ మీడియాలో మోడీ వీరాభిమానులు పోస్టులు పెడుతున్నారు.

ఒకప్పుడు మోడీ వీసాను అమెరికా రిజెక్టు చేసిందని.. ఇప్పుడు అదే మోడీ.. అమెరికా అధ్యక్షుడు స్వయంగా తనతో డిన్నర్ చేసేందుకు అమెరికా రమ్మని చెబితే.. నో చెప్పే దమ్ము.. ధైర్యం మోడీకి మాత్రమే సొంతమంటూ పోస్టులు పెడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ లో ట్రంప్ జోక్యంతో యుద్ధాన్ని ముగించినట్లుగా విమర్శలు వెల్లువెత్తటం.. దీనికి తోడు పాక్ తో భారత్ యుద్ధాన్ని తన మాటలతోనే ఆపినట్లుగా వ్యాఖ్యానించటం లాంటి చర్యలకు తక్షణం స్పందించని మోడీ.. దశల వారీగా తనదైన శైలిలో రియాక్టు అవుతున్న వైనం ఆయన ఇమేజ్ ను మరింత పెంచేలా చేస్తుందని చెప్పక తప్పదు.