దేశ రాజకీయాల్లో చంద్రబాబు 'చక్రం' ..!
దేశ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి చక్రం తిప్పనున్నారా? ఆయన ప్రాధాన్యం మరింత పెరగనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
By: Garuda Media | 15 May 2026 9:00 PM ISTదేశ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి చక్రం తిప్పనున్నారా? ఆయన ప్రాధాన్యం మరింత పెరగనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నా.. కేంద్రంలో చంద్రబాబుకు పెద్దగా ప్రాధాన్యం లేదన్నది వాస్తవం. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మిత్రపక్షాలతో చర్చించి తీసుకునేది. తద్వారా ఇబ్బందులను అధిగమించింది.
కానీ.. ప్రస్తుతం ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే.. వీటిలో కొన్ని సాఫీగానే జరుగుతున్నా.. మరికొన్ని బెడిసి కొడుతున్నాయి. దీనికి కారణం.. మిత్రపక్షాల తో చర్చించకుండా.. ప్రధాని తనే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. పార్లమెంటులో వీగిపోవడం.. బిల్లులను వెనక్కి తీసుకోవడం కామన్‌గా మారుతున్నా యి. ఈ విషయంలో కేంద్రం పునరాలోచనలో పడింది.
ముఖ్యంగా మహిళా రిజర్వేషన్‌ను.. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడంపై.. పార్టీలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లులు నిలిచిపోయాయి. కానీ.. ఇది ముందుకు సాగితే.. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకునేందుకు తమకు అవకాశం ఉంటుందని ఎన్డీయే అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ముందు పెట్టి.. జాతీయస్థాయిలో కీలకమైన బిల్లులను ఆమోదించుకునే దిశగా మోడీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో నోట్ల రద్దు విషయంలోనూ చంద్రబాబు నేతృత్వంలో కమిటీ వేసినట్టుగానే.. ఇప్పుడు.. నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనపై కూడా.. చంద్రబాబు సారథ్యంలో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రధాని మోడీ చంద్రబాబు నివాసానికి వచ్చినప్పుడు.. తాజాగా ఢిల్లీలో చంద్రబాబు పర్యటించినప్పుడు కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలు ఆయన చెప్పారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించినట్టు తెలిసింది. తద్వారా పార్టీలను నియోజకవర్గాల పునర్విభజనకు అంగీకరించేలా ఆయన ఒప్పించే బాధ్యతలు తీసుకుంటారు. ఫలితంగా బాబు ప్రభ జాతీయస్థాయిలో మరోసారి పెరగనుందన్న చర్చ ప్రారంభమైంది.
