ప్రధాని మోడీకి ఖలిస్తానీల సెగ.. ఏం చేస్తారు?
తాజాగా ప్రధాని కెనడాలో పర్యటించనున్నారు. ప్రస్తు తం సైప్రస్‌లో ఉన్న మోడీ.. మంగళవారం నుంచి రెండు రోజుల పాటు కెనడాలో పర్యటించనున్నారు.
By: Tupaki Desk | 16 Jun 2025 7:00 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆదివారం నుంచి ఆయన ఐదు రోజుల పాటు విదేశాల్లో పర్యటించేందుకు వెళ్లారు. క్రొయేసిషియా, సైప్రస్ సహా.. అత్యంతకీలకమైన కెనడాలోనూ ఆయ న పర్యటించనున్నారు. వాస్తవానికి కెనడాకు భారత్‌కు మధ్య కొన్నాళ్ల కిందటివరకు తీవ్ర మాటల యుద్ధం జరిగింది. అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. భారతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సిక్కులను టార్గెట్ చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.
ఈ పరిణామంపై భారత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. తర్వాత కాలంలో ట్రూడో అధికారం కోల్పోయారు. ప్రస్తుతం కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత.. కొంత మేరకు.. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ.. ఖలిస్తాన్ వాదుల నుంచి మాత్రం భారత్‌కు సెగ తగులుతూనే ఉంది. తాజాగా ప్రధాని కెనడాలో పర్యటించనున్నారు. ప్రస్తు తం సైప్రస్‌లో ఉన్న మోడీ.. మంగళవారం నుంచి రెండు రోజుల పాటు కెనడాలో పర్యటించనున్నారు.
కెనడాలో జీ-7 దేశాల సదస్సు జరగనుంది. వాస్తవానికి జీ-7లో భారత్ లేకపోయినా.. సంప్రదాయంగా కొన్ని దశాబ్దాలుగా భారత్‌ను అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఈ పరంపర నేటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని జీ-7 దేశాల సదస్సులో పాల్గొననున్నారు. అయితే.. ఆయన ఇంకా కెనడాలో అడుగు పెట్టక ముందే.. భారీ సెగ తెరమీదికి వచ్చింది. కెనడాలోని బలమైన సిక్కు వాదుల నుంచి ఆయనను వ్యతిరేకిస్తూ.. ప్రకటనలు వచ్చాయి.
ప్రధాని మోడీని కెనడాకు శత్రువుగా అభివర్ణించిన కెనడాలోని ఖలిస్తానీలు.. ఆయనను హిందూ ఉగ్రవాది గా పేర్కొన్నారు. మోడీ చేసే రాజకీయాలను అంతం చేస్తామని హెచ్చరిస్తూ.. పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టు కుని కెనడాలో భారీ ర్యాలీలు చేపట్టారు. అంతేకాదు.. కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ తీవ్రవాది నిజ్జర్ విషయంలోనూ భారత్ పాత్ర ఉందని ఆరోపించారు. మోడీని అడ్డుకునేందుకు అందరూ ఏకం కావాలని కూడా పిలుపునిచ్చారు. ఈ పరిణామాల క్రమంలో ప్రధాని మోడీ పర్యటన ఆద్యంతం ఉత్కంఠగా మారింది. మరి ఆయన నేరుగా కెనడాకు వెళ్తారా? లేక.. వెనక్కి వచ్చేస్తారా? అనేది చూడాలి.
