కేంద్రంలో కీలక మార్పులు!?.. రాజ్‌నాథ్ నివాసంలో రహస్య భేటీ
కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు జరగబోతున్నాయనే సంకేతాలు అందుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణతోపాటు వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకంపై జోరుగా కసరత్తు జరుగుతోంది.
By: Tupaki Desk | 21 Jun 2026 10:00 PM ISTకేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు జరగబోతున్నాయనే సంకేతాలు అందుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణతోపాటు వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకంపై జోరుగా కసరత్తు జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని కథనాలు వస్తున్నాయి. కేంద్రంలో ప్రధాని మోదీ 2.0 ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారని బీజేపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్-బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా 75 ఏళ్లు నిండిన వారిని మంత్రివర్గం నుంచి తప్పించాలనే ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో యువకులకు మంత్రివర్గంలో చోటివ్వాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయనే ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రముఖుల భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం అజెండా బయటకు రానప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చించేందుకే ఈ భేటీ జరిగి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గన్ని పునర్వ్యస్థీకరించాలని ఎప్పటి నుంచో బీజేపీ పెద్దలు అనుకుంటున్నారని, మంత్రి వర్గంలో ఎవరిని ఉంచాలి? ఎవరిని తప్పించాలి అన్న అంశంపై ఆర్ఎస్ఎస్ ప్రముఖుల అభిప్రాయం తీసుకోడానికి ఈ భేటీ జరిగిందని అంటున్నారు.
బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ నిర్ణయం ప్రకారమే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందనేది బహిరంగ రహస్యం. ప్రధానిగా మోదీకి ప్రభుత్వం నడిపే విషయంలో పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చినప్పటికీ ప్రభుత్వంలో ఎవరెవరు ఉండాలనేది ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని బీజేపీ రాజకీయాలు బాగా తెలిసిన వారు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో ఆర్ఎస్ఎస్ నేతలో బీజేపీ పెద్దల చర్చలు కేంద్ర మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న ప్రచారానికి ఊతమిస్తోందని అంటున్నారు.
యువతను ప్రోత్సహించడంతోపాటు వృద్ధ తరాన్ని తప్పించాలనే ఆలోచనతో కేంద్ర పెద్దలు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో సుమారు 40 శాతం మందిని తప్పించాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో కొందరు మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక పనితీరు సరిగా లేని వారిని తప్పించడంతోపాటు వారి స్థానంలో యువకులకు అవకాశమిస్తారని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలో కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తారని చెబుతున్నారు. మంత్రివర్గంలో సీనియర్లను తప్పించి వారికి గవర్నర్లుగా పంపుతారని అంటున్నారు. దీంతో ఎవరిపై వేటు పడుతుంది? ఎవరికి స్థాన చలనం ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
