మోడీ కేబినెట్ నుంచి ముగ్గురు గవర్నర్లు ?
కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని ఈ నెల 11న ఇండియా వస్తున్నారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.
By: Satya P | 8 July 2026 8:05 AM ISTకేంద్ర మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని ఈ నెల 11న ఇండియా వస్తున్నారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండింటికి మధ్యలో కచ్చితంగా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ కీలకమైన సమయంలో మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చు అని హస్తినలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. జూన్ 9న నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అయ్యాయి. ఇక జూలై 9 తో 25 నెలలు కూడా పూర్తి అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వంలో కొందరు మంత్రుల పనితీరు మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. దాంతో పాటు మంత్రి వర్గ విస్తరణకు ఇది సరైన సమయం అని భావిస్తున్నారు.
చాలా మందికి చోటు :
అవకాశాలు అవసరాలు అలాగే మార్పులు చేర్పుల మధ్య చాలా మందికి ఈసారి కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. అందులో అతి ముఖ్యుడిగా బీహార్ మాజీ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఉన్నారు అని అంటున్నారు. ఆయనతో పాటు ఇటీవల ఆప్ నుంచి విడి రాజ్యసభలో వేరుగా గుర్తింపు పొందిన ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘవ్ చద్దాకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. శివేసన ఉద్ధవ్ థాక్రే వర్గం నుంచి ఆరుగురు ఎంపీలు ప్రత్యేక వర్గంగా విడిపోయి వచ్చారు. వారిలో కూడా ఒకరిద్దరికి చాన్స్ ఇవ్వాలి. ఇక పశ్చిమ బెంగాల్ లో 20 మందికి పైగా ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి బయటకు వచ్చారు. వారి నుంచి కొందరికి చాన్స్ ఇవ్వాలి. ఇక అనేక రాష్ట్రాలలో రాజ్యసభ నుంచి నెగ్గిన వారు ఉన్నారు. అనేక ప్రధాన శాఖలలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా విద్యా శాఖ, ఆర్ధిక శాఖ, రైల్వే శాఖ ఇలా కీలక శాఖలలో కొత్త వారు మంత్రులుగా రాబోతున్నారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.
వీరిని గవర్నర్లుగా :
మరో వైపు చూస్తే ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో కీలక మంత్రిత్వ శాఖలు చూస్తున్న ముగ్గురుకి ఈసారి నో చాన్స్ అని అంటున్నారు. వారిని దేశంలో వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని చెబుతునారు. వారిలో మొదటి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఈయన హర్యానాకు చాలా ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. రెండేళ్ళ క్రితమే కేంద్ర మంత్రివర్గంలో చేరారు. ఈయనను ఇపుడు ఒక కీలక రాష్ట్రానికి గవర్నర్ గా పంపనున్నారు అని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారంగా ఉంది అంటున్నారు. అలాగే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఉండకపోవచ్చు అన్నది మరో ప్రచారంగా ఉంది. ఆయనను కూడా గవర్నర్ గా చేసి రాజ్ భవన్ కి పంపుతారు అని అంటున్నారు. ఇక మూడవ కేంద్ర మంత్రి మహేంద్ర నాధ్ పాండే. ఈయనను కూడా గవర్నర్ గా నియమిస్తారు అని అంటున్నారు.
పార్టీ పదవుల్లోకి సైతం :
అంతే కాదు చాలా మంది కేంద్ర మంత్రులను పార్టీ పదవులలోకి పంపనున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ని తప్పిస్తారు అన్నది అంతటా వినిపిస్తున్న మాట. ఆయనకు వేరే శాఖలను కూడా కేటాయించరు అని తెలుస్తోంది. ఆయనను బీజేపీ జాతీయ కార్యవర్గంలో కీలకమైన పదవిని ఇచ్చి బీజేపీని బలోపేతం చేసేందుకు వినియోగిస్తారు అని అంటున్నారు. ఒడిషాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వారు. ఆయన సేవలు పార్టీకి అవసరం అనుకుంటున్నారు. ఇంకో వైపు మరింత మంది కేంద్ర మంత్రులకు కూడా బీజేపీ ఆఫీస్ లో కీలక పాత్రలు అప్పగిస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం చూస్తే సమాంతరంగా కేంద్ర మంత్రి వర్గం కూర్పు అలాగే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలోని బీజేపీ కార్యవర్గం ఏర్పాటు విషయం మీద తీవ్ర స్థాయిలో కసరత్తు సాగుతోంది. మొత్తం మీద భారీ మార్పులకే ఈసారి కేంద్ర మంత్రి వర్గం శ్రీకారం చుట్టబోతోంది అని అంటున్నారు.
