Begin typing your search above and press return to search.

మూడో బెర్త్..ఆ నలుగురిలో లక్ ఎవరికి.?

ఇక కేంద్ర క్యాబినెట్‌లో తెలంగాణకు మూడో బెర్తు దక్కే అవకాశం ఉండటంతో..తెలంగాణ బీజేపీ ఎంపీలు గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారట.

By:  Tupaki Desk   |   30 Jun 2026 5:00 PM IST
మూడో బెర్త్..ఆ నలుగురిలో లక్ ఎవరికి.?
X

కేంద్రమంత్రి వర్గ ప్రక్షాళనపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వారం పది రోజుల్లోనే క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్‌ ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి చోటు దక్కెదెవరికి.? ఇద్దరు కేంద్రమంత్రుల్లో మోదీ టీమ్‌లో ఉండేదెవరు.? ఎగ్జిట్‌ ఎవరికి అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌ ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉండగా..రాష్ట్రానికి మరో బెర్త్ దక్కడం పక్కా అని టాక్..బీజేపీ స్టేట్‌ ఆఫీస్‌లో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది ఎంపీలు ఉండటం..తెలంగాణపై బీజేపీ అధిష్టానం సీరియస్ ఫోకస్ చేయడంతో..సెంట్రల్ క్యాబినెట్‌లో రాష్ట్రానికి మరింత ప్రాధాన్యం దక్కొచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. స్టేట్‌ నుంచి మరొకరిని సెంట్రల్ క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది.

బండి, కిషన్‌రెడ్డికి ఢోకా లేదా.?

తెలంగాణ నుంచి కేంద్రమంత్రి వర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణకు మూడు బెర్తులు కల్పిస్తే..ఆల్రెడీ కేంద్రమంత్రులుగా ఉన్న బండి, కిషన్‌రెడ్డిని కొనసాగిస్తారా.? ఆ ఇద్దరిని కూడా తప్పించి..ముగ్గురు కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అనేది చర్చనీయాంశం అవుతోంది. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కి ఈ మధ్య సమస్యలు పెరిగిపోయాయి. ఓవైపు పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా గ్రూప్‌ రాజకీయాలు ఎక్కువై పోగా..మరోవైపు కుమారుడు కేసులో ఇరుక్కోవడం..ఆ ఇష్యూపై దేశవ్యాప్తంగా చర్చ జరగడం ఇబ్బందికరంగా మారింది.

కొడుకు ఎపిసోడ్‌తో కాస్త సైలెంట్ అయిన బండి సంజయ్‌ని..కేంద్రమంత్రి పదవిలోని నుంచి తప్పించి..జాతీయ పార్టీలో కీలక పోస్ట్ అప్పగిస్తారన్న హాట్ నడుస్తోంది. బండి సంజయ్‌ని తప్పించాల్సి వస్తే..అదే మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకుంటారనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. లక్ష్మణ్‌ దగ్గరున్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవిని బండి సంజయ్‌కి ఇస్తారని పలువురు బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారట. ఇక కిషన్ రెడ్డి పోస్ట్‌కు ఢోకాలేదని..ఆయన శాఖలను మార్చే అవకాశం ఉందంటున్నారు.

ఆ నలుగురిలో చోటెవరికి.?

ఇక కేంద్ర క్యాబినెట్‌లో తెలంగాణకు మూడో బెర్తు దక్కే అవకాశం ఉండటంతో..తెలంగాణ బీజేపీ ఎంపీలు గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారట. హస్తినలో, బీజేపీ ముఖ్యనేతలతో తమకు ఉన్న పరిచయాలతో..తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారట. కేంద్రమంత్రి వర్గంలో తెలంగాణకు దక్కే మూడో అవకాశం కోసం ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్‌ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమెన్ కోటాలో డీకే అరుణ పేరుగా బలంగా వినిపిస్తోంది.

అయితే రెడ్డి సామాజికవర్గం నుంచి కిషన్‌రెడ్డి సెంట్రల్ క్యాబినెట్‌లో ఉండటంతో..డీకే అరుణకు అవకాశం ఇస్తే ఇద్దరు రెడ్డీలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఇక తెలంగాణలో కీలకంగా ఉన్న ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కు తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది. గతంలో బీఆర్ఎస్‌లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా పనిచేశారు. పైగా బీజేపీలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ జాతీయ నేతలు ఆయనకు చాలా హామీలిచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండుసార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు ఈటల.

కానీ ఈక్వేషన్స్‌ వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సారి తమ నేతకు బెర్త్ కన్ఫామ్‌ అని ఈటల అనుచరులు చెప్పుకుంటున్నారట. ఇక ధర్మపురి అరవింద్ మున్నూరు కాపుల్లో బలమైన లీడర్. వరుసగా రెండుసార్లు ఇందూరు నుంచి ఎంపీగా గెలిచి.. తన మాట దాడితో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ..ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. అయితే మున్నూరు కాపులో అయితే బండిని కొనసాగించడం లేకపోతే..లక్ష్మణ్‌కు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో..ఈ టర్మ్‌లో అరవింద్‌కు అమాత్య యోగం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక మంచి టాకింగ్ పవర్ నేత, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన రఘునందన్ రావు ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా మోదీ టీమ్‌లో పనిచేయాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో కేంద్ర క్యాబినెట్‌లో అడుగుపెట్టేదెవరో.? సంజయ్‌ని కొనసాగిస్తారో.? లేక లక్ష్మణ్‌కు అమాత్యం యోగం దక్కతుందా లేదా అనేది ఇప్పటికే క్లారిటీ లేని అంశంగానే ఉంది.