మోడీ మార్క్ ఫుల్ కేబినెట్....కొత్తగా మరో 40 మందికి గోల్డెన్ చాన్స్ ?
కేంద్రంలో నరేంద్ర మోడీ మూడో సారి అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్ళ కాలం గిర్రున తిరిగింది.
By: Satya P | 24 May 2026 9:43 AM ISTకేంద్రంలో నరేంద్ర మోడీ మూడో సారి అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్ళ కాలం గిర్రున తిరిగింది. దాంతో మంత్రి వర్గ విస్తరణకు మోడీ ప్రభుత్వం సిద్ధపడుతోంది అని అంటున్నారు. కేంద్రంలో ప్రస్తుతం ప్రధానిని మినహాయిస్తే 70 మంది దాకా మంత్రులు ఉన్నారు. ఫుల్ కేబినెట్ అంటే 82 మంది దాకా తీసుకోవచ్చు. అంటే ఈ కేబినెట్ ఇలా ఉండగానే మరో పన్నెండు మందికి అదనంగా చాన్స్ ఉంటుందన్న మాట. అయితే మోడీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు అని అంటున్నారు. దాంతో అదే కనుక జరిగితే ప్రస్తుతం ఉన్న డెబ్బై మందికో ముప్పయి మంది దాకా అవుట్ అవుతారు అని కూడా ఢిల్లీ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లెక్కన చూస్తే అవుట్ అయ్యే మంత్రులు ఫుల్ కేబినెట్ లో అదనంగా వచ్చే పన్నెండు మందిని కలుపుకుంటే కనుక 40 మందికి పైగానే కొత్త వారికి చాన్స్ దక్కుతుందని అంటున్నారు.
ఎన్నికల కేబినెట్ గా :
ఈ కేబినెట్ పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరణ అని కూడా అంటున్నారు. మరో మూడేళ్లలో లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది అంటే 2027 లో ఆరేడు రాష్ట్రాలకు 2028లో మరో ఎనిమిది దాకా రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే 14 దాకా అసెంబ్లీలకు ఎన్నికలు అన్న మాట. ఇందులో అధిక భాగం బీజేపీ ఖాతాలోవే ఉన్నాయి. దాంతో ఆయా రాష్ట్రాలలో అవసరాలు అన్నీ చూసుకుని మరీ కేబినెట్ లో చోటు కల్పిస్తారు అని అంటున్నారు. ఇక మోడీ 2024 లో ప్రమాణం చేసినపుడు మిత్రులకు పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే కేబినెట్ బెర్తులు దక్కాయి. ఈసారి ఆ శాతాన్ని పాతిక దాకా పెంచాలని చూస్తున్నారు అని అంటున్నారు. అంటే మొత్తం 82లో 21 మంది దాకా ఎన్డీయే మిత్ర పక్షాలకే మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. మిత్రులతో ప్రస్తుత అవసరాలు భవిష్యత్తు అవసరాలు అన్నీ దృష్టిలో ఉంచుకుని కేబినెట్ రూపకల్పన జరుగుతుందని అంటున్నారు.
అన్ని రాష్ట్రాలూ కవర్ :
ఈసారి పునర్వ్యవస్థీకరణలో అన్ని ప్రాంతాలు రాష్ట్రాలు కవర్ అవుతాయని చెబుతున్నారు. అలాగే సామాజిక సమతూకాలు కూడా ఉంటాయని యువతకు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. అంతే కాదు ఈసారి బ్యూరోక్రాట్లకు చోటు ఇచ్చే కంటే కూడా రెగ్యులర్ పొలిటీషియన్లకు చోటు కల్పిస్తారు అని అంటున్నారు. అదే విధంగా రాజ్యసభలో ఉన్న వారికి అవసరం మేరకు కేబినెట్ లో చాన్స్ ఇస్తూనే ఎక్కువగా లోక్ సభ సభ్యులకే ప్రాధాన్యత ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఇలా అనేక రకాలైన ఊహాగానల మధ్య మోడీ కేబినెట్ జూన్ లో పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని అంటున్నారు. మరి ఫుల్ కేబినెట్ అంటే ఇక 2029 దాకా మరోసారి చాన్స్ ఉండదు కాబట్టి ఎవరా అదృష్టవంతులో చూడాలి . ఒక వేళ ఈసారి చాన్స్ అందుకున్న వారికి మూడేళ్ల పాటు కేంద్రంలో మంత్రి యోగం ఖాయంగా కనిపిస్తోంది.
