నెహ్రూ వర్సెస్ మోడీ...పని దినాలు కొలమానమా ?
ఈ దేశంలో అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా నరేంద్ర మోడీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు.
By: Satya P | 12 Jun 2026 9:22 AM ISTఈ దేశంలో అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా నరేంద్ర మోడీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. 2026 జూన్ 10తో ఆయన ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా తొలి ప్రధాని పండిట్ నెహ్రూ రికార్డుని అధిగమించారు. 1952 మే 12 నుంచి 1964 మే 27 దాకా సుదీర్ఘంగా నెహ్రూ ఈ దేశాన్ని పాలించారు. మూడు సార్లు ఆయన ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆ విధంగా చూస్తే నెహ్రూ మొత్తం పని దినాలు 4,398 గా చరిత్రలో నమోదు అయి ఉంది. ఇక నరేంద్ర మోడీ విషయానికి వస్తే ఆయన 2014 మే 26న ప్రధానిగా తొలిసారి ప్రమాణం చేశారు. ఈ రోజుకీ ఆయన కొనసాగుతున్నారు. మోడీ కూడా మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. జూన్ 10తో ఆయన ప్రధానిగా 4,399 నెహ్రూ నంబర్ ని దాటేశారు అన్న మాట. ఇంకా మోడీ మరో మూడేళ్ళ పాలన పూర్తి చేసుకోనున్నారు. అంటే 2029 ఎన్నికల నాటికి సుమారుగా మరో వేయి రోజులు అయినా ప్రధానిగా ఉంటారు. ఆ లెక్క కూడా తీసుకుంటే మోడీని ఇప్పటిలో ఈ రికార్డు విషయంలో అధిగమించే వారు ఎవరూ ఉండరు అనది వాస్తవం. ఇక 2029 లో కూడా మోడీ గెలిచి మరో అయిదేళ్ళు అంటే 1825 రోజులు కూడా ఫుల్ టెర్మ్ కొనసాగితే మోడీ రికార్డు శాశ్వతం అయినా ఆశ్చర్యం అయితే లేదు.
పోలిక సబబేనా :
అయితే నెహ్రూ కంటే అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా మోడీ రికార్డుని సాధించడాన్ని మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అంగీకరిస్తూనే ఇద్దరికీ పోలిక పెట్టడం సమంజసమేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎందుకు అంటే నెహ్రూ ఈ దేశానికి ప్రధానిగా ఉన్న కాలం వేరు. మోడీ ఉన్న కాలం వేరు. అప్పటి పరిస్థితులు వేరు, ఇపుడు వేరు అని గుర్తు చేస్తున్నారు. నెహ్రూ ప్రధాని అయ్యేనాటికి ఈ దేశ జనాభా 35 కోట్లుగా ఉంది. అయితే ఆహార ధాన్యాలకే దేశం కరవుతో ఇబ్బంది పడుతోంది. అంతే కాదు విద్య వైద్యం, వ్యవసాయం పారిశ్రామిక రంగం నీటి వనరులు ఇలా ఏది చూసినా అన్ని విధాలుగా ఇబ్బందులు సమస్యలే ఉన్నాయి. అయితే నెహ్రూ తన పన్నెండేళ్ళ పాలనలో పంచ వర్ష ప్రణాళిలకు రూపొందించి దేశానికి చేసిన సేవలు ఆహార ధాన్యం విషయంలో స్వయం సమృద్ధి సాధించిన అంశాలను అంతా ఇపుడు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు హరిత విప్లవరం పారిశ్రామిక విప్లవం శాస్త్ర సాంకేతిక విప్లవానికి నెహ్రూ వేసిన పునాది చూపిన దారులు కూడా గొప్పవని అంటున్నారు.
ఆధునిక భారత నిర్మాతగా :
నెహ్రూని అంతా ఆధునిక భారత నిర్మాతగా చెబుతారు.ఆయన పాలనలో అన్ని రంగాలు పరుగులు తీశాయి. ముఖ్యంగా ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, యూజీసీ, ఎన్సీఈఆర్టీ, సీఎస్ ఐ ఆర్, ఎన్ పీఎల్, ఎన్సీఎల్, సైల్, భెల్, హెచ్ ఎల్, ఎల్ సి, ఎన్ ఎం డీసీ, హెచ్ ఎం టీ ఇలాంటివి ఎన్నో వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు భిలాయ్ స్టీల్ ప్లాంట్, రూర్కెలా స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్, బొకారో స్టీల్ ప్లాంట్ నెహ్రూ హయాంలో వచ్చాయని అంటున్నారు. అంతే కాదు దేశంలో అతి పెద్దదైన బాక్రానంగల్ ప్రాజెక్ట్, హిరాఖండ్ డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ వంటివి కూడా నెహ్రూ పాలనలో వచ్చాయని చెబుతున్నారు. దామోదర్ వాలీ కార్పోరేషన్, చెంబై వాలీ ప్రాజెక్ట్, హిందూస్థాన్ యాంటీబయోటిక్స్, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్, మేజగాన్ డాక్, డీఆర్ డీవో, బార్క్, ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ వంటివి నెహూ దార్శనికతకు నిదర్శనాలుగా చెబుతున్నారు.
మోడీ హయాంలో :
మరి పన్నెండేళ్ళ మోడీ పాలనలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్ని అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఉన్న వాటిని ప్రైవేటు చేస్తున్నారని కూడా మేధావులు విమర్శిస్తున్నారు. పరిశ్రమలను ఆధునిక దేవాలయాలుగా నెహ్రూ పేర్కొంటే వాటిని ప్రైవేట్ పరం చేయడం ప్రస్తుతం జరుగుతోంది అని ఆక్షేపిస్తున్నారు. బాక్రానంగల్ వంటి భారీ ప్రాజెక్ట్ ఒక్కటి అయినా మోడీ హయాంలో కట్టారా అని అడుగుతున్నారు. అలాగే అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ అణు పరిశోధనకు శ్రీకారం కానీ నెహ్రూ ఏలుబడిలోనే జరిగిందని గుర్తు చేస్తున్నారు. అందువల్ల పని దినాలు కొలమానాలు కావని పని తీరే ఎపుడూ చరిత్రలో ఉంటుందని కూడా చెబుతున్నారు. మరి దీని మీద బీజేపీ వర్గాలు ఎలా బదులిస్తాయో చూడాల్సి ఉంది.
