అటు మోడీ...ఇటు బాబు...ఒకే ఆలోచనతో !
కేంద్రంలో నరేంద్ర మోడీ వరసగా మూడవ సారి అధికారం చేపట్టి జూన్ 9 నాటికి సరిగ్గా 11 ఏళ్ళు పూర్తి అవుతుంది.
By: Tupaki Desk | 9 Jun 2025 9:40 AM ISTకేంద్రంలో నరేంద్ర మోడీ వరసగా మూడవ సారి అధికారం చేపట్టి జూన్ 9 నాటికి సరిగ్గా 11 ఏళ్ళు పూర్తి అవుతుంది. 2014లో తొలిసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోడీ ఇప్పటిదాకా నాన్ స్టాప్ గా పాలన చేస్తూనే ఉన్నారు. ప్రధానిగా అలా నెగ్గుతూనే ఉన్నారు.
ఇక 2024లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోయినా ఎన్డీయే మిత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరీ మోడీ హ్యాట్రిక్ పీఎం గా రికార్డు క్రియేట్ చేశారు. అలా మోడీ ప్రధాని పదవిలో ఉన్న కాలం 11 ఏళ్ళు పూర్తి అవుతోంది.
దాంతో బీజేపీ ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశవ్యాప్తంగా ర్యాలీలు విజయోత్సవాలు సమావేశాలు చర్చలు మేధ మధనాలు రౌండ్ టేబిల్ మీటింగ్స్ ఇలా కాదేదీ ప్రచారం అన్నట్లుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు ఏకంగా 70 రోజుల పాటు సాగుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. గత నేలలో బీజేపీ తిరంగా ర్యాలీలు చేసింది. జూన్ నుంచి మరో రెండున్నర నెలల పాటు మోడీ నాయకత్వంలో బీజేపీ పదకొండేళ్ళ పాలనం మీద దేశవ్యాప్తంగా విజయ సంరంభాలకు తెర తీస్తోంది అన్న మాట.
విషయం ఏది అయినా జనాలకు కనెక్ట్ కావడమే ఇక్కడ ఆలోచన. ఈ పదకొండేళ్ళ కాలంలో మోడీ ప్రభుత్వం దేశంలో ఏమి చేసింది, ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి ఫలాలను అందించింది అన్నది చర్చకు పెడుతూ జనంలోకి పోవడమే అసలు ఉద్దేశ్యం. కేంద్ర మంత్రుల నుంచి స్థానిక పార్టీ నాయకుల దాకా అంతా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఇక ఏపీలో చూస్తే జూన్ 12 నాటికి ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి అవుతోంది. దాంతో ఆ రోజు అంతా ఏపీ వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాలని కూటమి పెద్ద చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో మండలంలో గ్రామంలో కూటమి ఏడాది పాటు చేసిన పాలనలో సాధించిన విజయాలతో పాటు వైసీపీ అయిదేళ్ళ పాలనలో చేసిన అరాచకాలను జనాలను వివరించాలని కూటమి పెద్దలు సూచిస్తున్నారు.
దాంతో విజయోత్సవాలే ప్రచార అస్త్రాలుగా మార్చుకుని మోడీ చంద్రబాబు ఒకే రకమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నారన్న మాట. ప్రజలకు తాము ఏమి మేలు చేసింది ఈ సందర్భంగా అటు బీజేపీ ఇటు టీడీపీ జనసేన పార్టీలు వివరిస్తారు. ఇదే పాలన మరింత కాలమ కొనసాగేలా జనాల దీవెనలు అందుకునేందుకు కూడా వారికి విన్నపాలు చేస్తారు మొత్తానికి మోడీ బాబు విజయోత్సాహంతో ఉన్నారు. క్యాడర్ కూడా రంగంలోకి దిగితే ఈ ఉత్సవాల ఉత్సాహం ఏమిటి జనాల నుంచి వచ్చే రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది అర్ధమవుతుంది అని అంటున్నారు.
