త్వరలో తెర మీదకు పీఎం మోడీ ఏసీ యోజన స్కీం? నిజమేనా?
మీ ఇంట్లో పాత ఏసీ ఉందా? అయితే.. దాని స్థానే కొత్త ఏసీ కొనేసే రోజులు దగ్గర్లోకి వచ్చేసినట్లే. నిక్షేపంలా పని చేసే పాత ఏసీని కొత్త ఏసీ కొనాలా? ఏసీ ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఇప్పుడు వాటి ధరలు మండిపోతున్నాయి.
By: Tupaki Desk | 18 April 2025 10:08 AM ISTమీ ఇంట్లో పాత ఏసీ ఉందా? అయితే.. దాని స్థానే కొత్త ఏసీ కొనేసే రోజులు దగ్గర్లోకి వచ్చేసినట్లే. నిక్షేపంలా పని చేసే పాత ఏసీని కొత్త ఏసీ కొనాలా? ఏసీ ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఇప్పుడు వాటి ధరలు మండిపోతున్నాయి. పాత ఏసీ తీసేసి.. కొత్త ఏసీ కొనటం అంత ఈజీ కాదంటూ క్లాస్ పీకాలని డిసైడ్ అవుతున్నారా? కాస్త ఆగండి. తాజాగా తెర మీదకు వచ్చిన ఈ కొత్త విషయం గురించి చదివిన తరవాత మీరు అనుకున్నది చేయాలా? చేయకూడదా? అన్నది డిసైడ్ చేసుకోవచ్చు.
మారిన వాతావరణ పరిస్థితుల పుణ్యమా అని దేశంలో ఎండల తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీ అమ్మకాలు పెరుగుతున్నాయి. 2021-22లో84 లక్షల ఏసీలు అమ్ముడైతే.. 2023-24 నాటికి అది కాస్తా 1.1 కోట్ల ఏసీలు అమ్ముడైన విషయం గణాంకాల ద్వారా వెల్లడైంది.
ఏసీల వినియోగం పెరుగుతున్న వేళ.. విద్యుత్ బిల్లు భారీగా వచ్చేలా చేసే పాత ఏసీల స్థానే కొత్త ఏసీలు కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక కొత్త స్కీంను కేంద్ర ప్రభుత్వం తెర మీదకు తీసుకురానున్నట్లుగా వెల్లడించారు.అధికారిక వర్గాలు ధ్రువీకరించనప్పటికి.. త్వరలో కేంద్రం పీఎం మోడీ ఏసీ యోజన స్కీం అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను వెల్లడించేందుకు వీలుగా చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో ఇది తెర మీదకు రానున్నట్లు చెబుతున్నారు.
ఇంతకూ ఈ స్కీం ప్రధాన ఉద్దేశం ఏమిటి? దీని కింద ఏం చేయనున్నారు? అన్నవిషయాల్లోకి వెళితే.. పాత ఏసీలను వినియోగించటం ద్వారా అధికంగా విద్యుత్ ను వినియోగించాల్సి వస్తోంది. దీని స్థానే.. కొత్త 5 స్టార్ రేటింగ్ ఉన్న కొత్త ఏసీల్ని వినియోగించటం ద్వారా విద్యుత్ బిల్లు తగ్గటమే కాదు.. దేశీయంగా విద్యుత్ వినియోగం భారీగా తేడా వచ్చే వీలుంది. పాత ఏసీలకు బదులు కొత్త ఏసీని ఒక ఏడాది వినియోగించటం ద్వారా రూ.6300 వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని తేల్చారు. కుటుంబాల మీద ఖర్చు తగ్గటంతో పాటు..విద్యుత్ గ్రిడ్ మీదా ఒత్తిడి తగ్గించేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు.
ప్రధాని మోడీ ఏసీ యోజన కింద.. పాత ఏసీని గుర్తింపు పొందిన రీసైక్లింగ్ యూనిట్ లో ఇస్తే.. వారు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. కొత్త ఏసీని కొనే వేళలో.. ఆ సర్టిఫికేట్ చూపించటం ద్వారా కస్టమర్లకు డిస్కౌంట్ ఇచ్చేలా విధానాన్ని తీసుకురానున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే..ఏసీలు ఉత్పత్తి చేసే పరిశ్రమలకు మరింత డిమాండ్ పెరుగుతుందని చెప్పక తప్పదు.
