Begin typing your search above and press return to search.

ఆ రాత్రి రాజ్ నాథ్ తనతో ఏం చెప్పారో షేర్ చేసిన ఆర్మీ ప్రముఖుడు!

తాజాగా ఆయన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. అందులో ఆయన పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 7:30 AM GMT
ఆ రాత్రి రాజ్ నాథ్ తనతో ఏం చెప్పారో షేర్ చేసిన ఆర్మీ ప్రముఖుడు!
X

చాలా అరుదుగా మాత్రమే సైనిక అంశాల గురించి.. కీలక పరిస్థితుల్లో ఏం జరిగిందన్న విషయాల్ని కొందరు సైనిక ప్రముఖులు ఓపెన్ అవుతుంటారు. తాజాగా అలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. యుద్ధం అంచుల వరకు వెళ్లిన వైనం.. దాన్నుంచి తిరిగి వచ్చిన క్రమానికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు మాజీ భారత సైనికాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె.

తాజాగా ఆయన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. అందులో ఆయన పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. మూడేళ్ల క్రితం భారత్ - చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణను.. ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతలను ప్రస్తావించారు. మే ఐదున మొదలైన ఉద్రిక్తత దాదాపు తొమ్మిది నెలల పాటు సాగిన విషయాన్ని పేర్కొనటమే కాదు.. ఆ సందర్భంగా ఏం జరిగిందన్న విషయాల్ని ఆయన వివరంగా వెల్లడించారు.

ఆగస్టు 31 రాత్రి రక్షణ శాఖ మంత్రి.. విదేశాంగ మంత్రి.. జాతీయ భద్రతా సలహాదారుతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ల మధ్య ఫోన్ సంబాషణలు.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇచ్చిన ఆదేశాల్ని గుర్తు చేసుకున్నఆయన.. ఆసక్తికర అంశాలతో పాటు సంచలన నిజాల్ని ప్రస్తావించారు. సరిహద్దుల్లోని పరిస్థితిని.. తీవ్రతను మంత్రి రాజ్ నాథ్ కు తెలియజేశాం. రాత్రి పదకొండున్నర గంటల వేళకు తిరిగి ఫోన్ చేస్తానని రాజ్ నాథ్ నాతో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడినట్లుగా చెప్పారు. పూర్తిగా సైనిక నిర్ణయమని.. ఏది సముచితంగా అనిపిస్తే దాన్ని చేయండి" అంటూ చెప్పేశారన్నారు.

రాజ్ నాథ్ మాటలతో మొత్తం బాధ్యత తన మీద పడినట్లైందన్న ఆయన.. "ఒక్కసారిగా దీర్ఘ శ్వాస తీసుకున్నా. కొద్ది నిమిషాల పాటు మౌనంగా కూర్చున్నా. ఆ తర్వాత తూర్పుకమాండ్.. పలువురు ఇతర ఆర్మీ అధికారులతో కొన్ని మ్యాపుల్ని పరిశీలించాం. అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం.కానీ.. నిజంగానే యుద్ధం ప్రారంభించాలా? అన్నది ప్రశ్నగా మారింది.

దీనికి కారణాలు లేకపోలేదు. ఓవైపు కొవిడ్.. మరోవైపు ప్రతికూల ఆర్థిక పరిస్థితి. ఇలాంటి వేళ వస్తు సరఫరా వ్యవస్థ దెబ్బతినటంలాంటి పరిస్థితులు ఉన్నవేళలో.. యుద్ధం మొదలైతే అంతర్జాతీయంగా మనకు మద్దతుగా నిలివే వారెవరు? చైనా-పాక్ కలిస్తే మనకు ఎదురయ్యే ముప్పు ఏంటి? లంటి అనేక ప్రశ్నలో మదిలో నిలిచాయి" అంటూ నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు. యుద్ధం అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా తన పుస్తకంలో పేర్కొన్నారు.త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ పుస్తకంలో మరిన్ని ఆసక్తికర అంశాలు ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు.