బీజేపీ తరఫున నామినేషన్.. ఎమ్మెల్సీ టికెట్ ఆయనకే!
ఈ క్రమంలో బీజేపీ తరఫున ఎస్. గౌతమ్‌రావును కేంద్రంలో పెద్దలు ప్రకటించారు.
By: Tupaki Desk | 4 April 2025 3:15 PM ISTహైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు నామినేషన్ల గడువు శుక్రవారం(ఏప్రిల్ 4)తో ముగియనుంది. దీంతో బీజేపీ తరఫున కీలక నాయకుడికి టికెట్‌ను ఖరారు చేశారు. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఈవిషయంలో దూకుడుగా ఉంది. హైదరాబాద్ నగర పాలక సంస్థలో బీజేపీకి 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే.. బీఆర్ ఎస్+ ఎంఐఎం కలిసి ప్రస్తుతం పాలన సాగిస్తున్నాయి.
కార్పొరేటర్‌గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి మాత్రం బీఆర్ ఎస్ తరఫున గతంలో ఎన్నికైనా..కొన్నాళ్ల కిందట ఆమె తన తండ్రితో కలిసి కాంగ్రెస్ గూటికి చేరింది. ఇదిలావుంటే.. ప్రస్తుతం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా కింద ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయన పదవి కాలం మే 1తో ముగియనుంది. దీంతో కొన్నాళ్ల కిందట కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికకు షెడ్యూల్ జారీ చేసింది. దీని ప్రకారం శుక్రవారంతో నామినేషన్లకు గడువు ముగియనుంది.
ఈ క్రమంలో బీజేపీ తరఫున ఎస్. గౌతమ్‌రావును కేంద్రంలో పెద్దలు ప్రకటించారు. ప్రస్తుతం క్రియాశీ లకంగా వ్యవహరిస్తున్న గౌతమ్ రావు.. బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. ఈయనకు తాజాగా టికెట్ దక్కడం గమనార్హం. గౌతమ్ రావు కూడా.. గతంలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా హైదరాబాద్‌లో పనిచేశారు. ఈయనకు కిషన్‌రెడ్డి సహా పలువురు కీలక నాయకుల ఆశీస్సులు ఉండడం గమనార్హం. ఇదిలావుంటే.. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనున్న ఎమ్మెల్సీ స్థానానికి ఇదే నెల 25న రిజల్ట్ కూడా రానుంది.
