గులాబీ జెండాలు.. కండువాలు ఎందుకు లేవు కవితక్క?
అందుకు భిన్నంగా తనను మాత్రమే స్పెషల్ గా ఫోకస్ చేసేలా ఉండటం వెనుక మర్మం అందరికి అర్థమయ్యేలా చేయటం సరికాదంటున్నారు.
By: Tupaki Desk | 25 May 2025 10:26 AM IST"దేవుడు చుట్టూ దెయ్యాలు చేరాయి. పార్టీలో నాపై అంతర్గత కుట్రలు.. కుతంత్రాలు చేస్తున్నాయి. కేసీఆర్ దేవుడు.. ఆయనే మా నాయకుడు.. నాన్నకు లేఖ వెనుక వ్యక్తిగత ఎజెండా లేదు. రాసింది నేనే. తరచూ ఫీడ్ బ్యాక్ ఇస్తుంటా. పార్టీలో అన్ని స్థాయిల్లోని వారు అనుకుంటున్న విషయాల్నే నేను నా లేఖలో ప్రస్తావించాను. నా లేఖే బయటపడితే.. మిగిలిన వారి సంగతేంటి? లోపాలపై చర్చించాలి. కోవర్టుల్ని తప్పించాలి" ఇలాంటి సంచలన వ్యాఖ్యలతో బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా మారారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ బిడ్డగా సుపరిచితురాలైన ఆమె.. ఇప్పుడు తన తండ్రి పార్టీపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారా? అన్న ప్రశ్నలు తలెత్తేలా కవిత వ్యాఖ్యలు ఉండటం తెలిసిందే.
తనకు తాను పార్టీకి విధేయురాలన్నట్లుగా మాటల్లో బిల్డప్ ఇచ్చిన కవిత.. చేతల్లో మాత్రం తప్పులో కాలేశారు. చేసే పని కాస్త జాగ్రత్తగా చేసి ఉంటే బాగుండేదని.. తెలివిగా వ్యవహరించి ఉంటే మరింత పద్దతిగా ఉండేదన్న మాట వినిపిస్తోంది. విదేశాల నుంచి వస్తున్న కవితకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవితకు ఘన స్వాగతం పలకటానికి.. ఆమెకు మద్దతుగా నిలవటానికి పెద్ద ఎత్తున అభిమానులు ఉండటం తెలిసిందే.
ఎయిర్ పోర్టుకు వచ్చిన వారి చేతుల్లో ఉన్నది కవిత ఫోటోతో ఉన్న ప్లకార్డులు.. కవితకు మద్దతు తెలిపే బ్యానర్లు తప్పించి.. బీఆర్ఎస్ పార్టీ జెండా కానీ.. పార్టీ అధినేత కేసీఆర్ ఫోటో కానీ కనిపించని పరిస్థితి. పార్టీలోని దెయ్యాల మీదే కవిత పోరు అయితే.. గులాబీ జెండా ఎందుకు లేకుండా పోయింది? అన్నది ప్రశ్నగా మారింది. తన మాటలకు.. చేతలకు మధ్య ఉన్న గ్యాప్ కవిత ఆలోచనలు ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెబుతున్నారు.
అదే సమయంలో గులాబీ పార్టీలోని దెయ్యాల మీద ఆమె పోరు అయి ఉంటే.. గులాబీ దళాన్ని తనకు అండగా ఉన్న విషయాన్ని స్పష్టం చేసేలా చర్యలు ఉండాలే తప్పించి.. అందుకు భిన్నంగా తనను మాత్రమే స్పెషల్ గా ఫోకస్ చేసేలా ఉండటం వెనుక మర్మం అందరికి అర్థమయ్యేలా చేయటం సరికాదంటున్నారు. చూసినంతనే చిన్నాపిల్లాడికి సైతం అర్థమయ్యేలా ఉన్న కవిత ప్లానింగ్ పేలవంగా ఉందంటున్నారు. మరికాస్తా డీప్ గా థింక్ చేసి ఉంటే బాగుండేదన్న సూచనను కవితకు ఇచ్చేవారెవరు?
