Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ బైక్ తీసుకొని 330కి.మీ. జర్నీ చేసి అసెంబ్లీకి ఆ ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే కమలేశ్వర్ డొడియార్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బైక్ మీద 330 కి.మీ.

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:27 AM GMT
ఫ్రెండ్ బైక్ తీసుకొని 330కి.మీ. జర్నీ చేసి అసెంబ్లీకి ఆ ఎమ్మెల్యే
X

తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికలు.. వాటిల్లో పోటీ చేసే అభ్యర్థుల ధనబలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఊరి సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తి సైతం ఇన్నోవా కారును మొయింటైన్ చేసే ధోరణి కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించని సీన్ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఉదంతమే తాజాగా వెలుగు చూసింది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే కమలేశ్వర్ డొడియార్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బైక్ మీద 330 కి.మీ. ప్రయాణించిన వైనం అందరిని ఆకర్షించింది.అయితే.. ఇదేదో సంచలనం కోసమో.. పేరు ప్రఖ్యాతుల కోసమే చేయలేదని చెబుతున్నారు. ఎందుకంటే.. సదరు ఎమ్మెల్యేకు సొంతంగా కారు కానీ.. బైక్ కానీ లేదు.

స్నేహితుడి దగ్గర నుంచి తీసుకున్న బైక్ మీద అంద దూరం ప్రయాణించాడు. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచాడన్న విషయంలోకి వెళితే.. భారతీయ ఆదివాసీ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అతనే కావటం గమనార్హం. తనకు కారు కొనే స్తోమత లేదని పేర్కొనటం విశేషం. అతడి సొంతూరు రత్లాం జిల్లా సైలానా. అక్కడి నుంచి 330 కి.మీ. దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని భోపాల్ కు బైక్ మీద వచ్చారు. అసెంబ్లీ అధికారులకు తాను ఎమ్మెల్యేగా గెలిచిన ధ్రువపత్రాన్ని చూపించిఅసెంబ్లీలోకి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వారి హడావుడిని చూసినప్పుడు.. ఇలాంటి ఉదంతాలు విస్మయానికి గురి చేసేలా ఉంటాయని చెప్పక తప్పదు.