Begin typing your search above and press return to search.

గులాబీ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసు చెప్పే పాఠమేంటి?

ఒక తప్పును కవర్ చేసే ప్రయత్నంలో మరో తప్పు.. అలా చేసుకుంటూ పోతూ.. చలానాతో పోయే అంశాన్ని రిమాండ్ చేసే వరకు తీసుకెళ్లారు.

By:  Tupaki Desk   |   11 April 2024 4:39 AM GMT
గులాబీ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసు చెప్పే పాఠమేంటి?
X

తెలిసి కానీ తెలియక కానీ నేరం చేసిన తర్వాత దాన్ని కవర్ చేయటానికి మించిన పొరపాటు మరొకటి ఉండదు. ఆ మైండ్ సెట్ తో వేసే ప్రతి అడుగు తప్పటడుగా మారటమే కాదు కంపు కావటం ఖాయం. గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ఎపిసోడ్ దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. సింఫుల్ గా ఒక చలానాతో పోయే అంశాన్ని.. దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో అదో రాచపుండుగా మారి.. దేశం వదిలి పారిపోయే వరకు వెళ్లటమే కాదు.. చివరకు రిమాండ్ వరకు వెళ్లాల్సి వచ్చిన వైనం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పాలి. అసలేం జరిగిందంటే..

ఒక అర్థరాత్రి వేళలో రాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన కారు బేగంపేటలోని నాటి ప్రగతిభవన్ కు దగ్గర్లో రోడ్డు డివైడర్ నుఢీకొట్టింది. ఈ సమయంలో కారును డ్రైవ్ చేస్తున్నది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్. ఆ సమయంలో అతను మద్యం సేవించి లేడు. నిజానికి ఇదో పెట్టీ కేస్. మరింత స్పష్టంగా చెప్పాలంటే చలానా వేసి క్లోజ్ చేసే కేసు. కానీ.. భయపడిపోయిన రాహిల్.. ఈ కేసు నుంచి తప్పించుకోవటానికి తనకు బదులుగా మరొకరిని కారు డ్రైవ్ చేసేలా మార్చారు.

అంతేకాదు.. అక్కడి పోలీసు అధికారులతో కేసును బయటకు రానివ్వకుండా చూడాలని కోరటంతో పాటు.. దీనికి సంబంధించి తానేం చేయటానికైనా సిద్దమని పేర్కొన్నారు. అయితే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించి పోలీసు అధికారుల్లోని కొందరికి.. మీడియా సంస్థలో పని చేసే ఒక క్రైం రిపోర్టర్ కు మధ్య చోటు చేసుకున్న పంచాయితీ.. విషయాన్ని లీక్ అయ్యేలా చేసింది.

ఒక తప్పును కవర్ చేసే ప్రయత్నంలో మరో తప్పు.. అలా చేసుకుంటూ పోతూ.. చలానాతో పోయే అంశాన్ని రిమాండ్ చేసే వరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో భయాందోళనలకు గురైన రాహిల్.. అప్పటికప్పుడు దుబాయ్ వెళ్లినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అనంతరం అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ కావటం మొదలు భారీగా ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో పోలీసులు పలువురి మీద సస్పెండ్ వేటు పడ్డాయి. చివరకు రాహిల్ హైదరాబాద్ కు రాక తప్పలేదు. పోలీసుల ఎదుట లొంగిపోక తప్పలేదు.

దీంతో.. అతడ్ని రిమాండ్ కు పంపారు. ఇదిలా ఉంటే.. తాజాగా బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టులో దాఖలు చేయటం.. దానిపై జరిగిన వాదనల్లో అతడి రిమాండ్ ను తొలగిస్తూ.. బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ ప్రక్రియలో భాగంగా రూ.20వేల షూరిటీలు సమర్పించాలని కోర్టు కోరింది. అదే సమయంలో అతడ్ని పోలీసుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో.. ఈ మొత్తం ఎపిసోడ్ లో రాహిల్ కు మొదటిసారి కాస్తంత ఉపశమనం లభించిందని చెప్పాలి. ఇదంతా చూశాక అర్థమయ్యేది ఒక్కటే.. తప్పు చేసినప్పుడు కాస్త కష్టమైనా భరిస్తూ చట్టప్రకారం ముందుకు వెళితే ఏ గొడవా ఉండదు. అందుకు భిన్నంగా తిమ్మిని బమ్మిని చేయాలని ప్రయత్నిస్తే మాత్రం చిరిగి చాట కావటం ఖాయం. సో.. తప్పులు చేసే విషయంలో బీకేర్ ఫుల్ అన్నది మరవొద్దు.